English   

టాలీవుడ్ లో క్యాస్టింగ్ కౌచ్ ఉందా..?

తెలుగు ఇండస్ట్రీ దేశంలోనే రెండో అతి పెద్ద ఇండస్ట్రీ. బాలీవుడ్ తర్వాత అంత పెద్ద ఇండస్ట్రీ టాలీవుడ్. ఇక్కడ ఏడాదికి కనీసం 150 సినిమాలు నిర్మిస్తున్నారు. దాదాపు 1000 కోట్ల మార్కెట్ ఉన్న ఇండస్ట్రీ ఇది. ఇలాంటి ఇండస్ట్రీ గురించి ఎవరైనా ఒక్క మాట మాట్లాడాలంటే ఆలోచిస్తారు. కానీ  ఈ మధ్య హీరోయిన్లు మాత్రం తెలుగు ఇండస్ట్రీని తీసి పారేస్తున్నారు. ఇక్కడి పరువును బజారుకు ఈడుస్తున్నారు. ఒక్కరు ఇద్దరు కాదు.. అరడజన్ మంది భామలు తెలుగు ఇండస్ట్రీ గురించి నీచంగా మాట్లాడారు. ఇక్కడి హీరోలపై ఆరోపణలు చేసారు. నిజంగా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉందా.. అంటే అవకాశాల కోసం హీరోయిన్లను శారీరకంగా వాడుకుంటారా..? ఏమో ఈ మధ్య కొందరి కమెంట్స్ చూస్తుంటే ఇది నిజమే అనిపిస్తుంది. రాధికాఆప్టే నుంచి నిన్నటి కస్తూరి వరకు అంతా టాలీవుడ్ ను టార్గెట్ చేసిన వారే.
తెలుగు ఇండస్ట్రీలో ఓ హీరో తనను పడకగదికి రమ్మన్నాడని.. ఆ హీరో ప్రస్తుతం రాజకీయాల్లో ఉన్నాడని చెప్పి ఈ మధ్య సంచలనం సృష్టించింది కస్తూరి. అన్నమయ్యా సినిమాతో బాగా పాపులర్ అయింది ఈ బ్యూటీ. తాను లొంగనందుకు అవకాశాలు రాకుండా చేసాడని చెప్పింది. ఇక దీనికంటే ముందు కన్నడ హీరోయిన్ శృతిహరిహరన్ కూడా తెలుగులో హీరోయిన్లు తమను సమర్పించుకోకపోతే నెగ్గుకురాలేరని చెప్పింది. రాధిక ఆప్టే కూడా ఇక్కడి హీరోలకు మర్యాదే తెలియదని మాట్లాడింది. తాప్సీ కూడా టాలీవుడ్ పై సంచలన కమెంట్స్ చేసింది. వీళ్ళే కాదు.. మాధవిలత కూడా తెలుగులో అవకాశాల కోసం పడుకోక తప్పదని చెప్పింది. చిన్న హీరోయిన్ల నోటి నుంచి ఇలాంటి మాటలొస్తున్నాయి. కానీ పెద్దోళ్లు మాత్రం చాలా సైలెంట్ గా ఉంటున్నారు. కానీ నిప్పు లేనిదే పొగ రాదు కదా.. అసలు ఇండస్ట్రీలో ఏం జరుగుతుందో అని ప్రేక్షకులు కూడా ఆసక్తిగా చూస్తున్నారు. మొత్తంగా ఇలాంటి కమెంట్స్ విన్నపుడే అనవసరంగా ఇండస్ట్రీకి చెడ్డ పేరు వస్తుంది. మరి హీరోయిన్లే కావాలని ఇలా చెబుతున్నారా.. లేదంటే నిజంగానే అలాంటి ప్రభుద్ధులు ఇండస్ట్రీలో ఉన్నారా అనే విషయం మాత్రం దేవుడికే తెలియాలి.

More Related Stories