English   

మ‌హాన‌టి.. డిసెంబ‌ర్ 6 మ‌.3 గంట‌లు..

Mahanati-Team-Special-Surprise-To-Fans

ఏంటీ లెక్క అనుకుంటున్నారా..? డిసెంబ‌ర్ 6 అంటే సావిత్రి జ‌యంతి. తెలుగు వాళ్ల‌కు హీరోయిన్ అంటే సావిత్రి.. ఆ త‌ర్వాతే ఎవ‌రైనా. ఏ ఆడ‌పిల్లైనా ల‌క్ష‌ణంగా చీర క‌ట్టుకుని క‌నిపిస్తే చాలు.. చూడ‌రా సావిత్రిలా ఎంత ప‌ద్ద‌తిగా ఉందో అంటారు. అంత‌లా తెలుగు వాళ్ల గుండెల్లో నిలిచిపోయింది ఆ మ‌హాన‌టి. 80 ఏళ్ల తెలుగు ఇండ‌స్ట్రీ చ‌రిత్ర‌లో ఒక్క సావిత్రిని త‌ప్ప మ‌రే న‌టిని కూడా మ‌హాన‌టి అనే ధైర్యం చేయ‌లేరు ఎవ్వ‌రూ. అదీ ఆమె స్థానం ఇండ‌స్ట్రీలో. ఇప్పుడు ఆమె జీవితంపై సినిమా వ‌స్తుందంటే దానిపై ఎంతటి అంచ‌నాలుంటాయి..? ఇప్పుడు ఆ అంచ‌నాల్ని ఒకే సినిమా అనుభ‌వం ఉన్న కుర్ర ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ మోస్తున్నాడు. ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యంతో ద‌ర్శ‌కుడిగా మారిన ఈ కుర్రాడు.. రెండో సినిమా కోసం ఏదో క‌మ‌ర్షియ‌ల్ క‌థ రాసుకోకుండా ఏకంగా సావిత్రి జీవితంపై ప‌డ్డాడు.

సావిత్రి పాత్ర‌లో కీర్తిసురేష్ న‌టిస్తుండ‌గా.. స‌మంత జ‌మున పాత్ర‌లో క‌నిపిస్తుంది. ప్ర‌స్తుతం ఈ చిత్ర షూటింగ్ హైద‌రాబాద్ లో జ‌రుగుతుంది. స‌మంత ఇందులో ఓ జ‌ర్న‌లిస్ట్ పాత్ర‌లో స‌మంత న‌టించ‌బోతుంద‌ని తెలుస్తోంది. ఈ చిత్రంపై రోజురోజుకీ ఆస‌క్తి పెరిగిపోతుంది. దానికి కార‌ణం అందులో న‌టిస్తోన్న న‌టులే. క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్ బాబు కూడా ఇందులో న‌టిస్తున్నాడు. లెజెండ‌రీ న‌టుడు ఎస్వీ రంగారావు పాత్ర‌లో ఈయ‌న క‌నిపిస్తున్నాడు. సావిత్రి జీవితాన్ని ద‌గ్గ‌ర్నుంచి చూసిన వాళ్ల‌లో ఎస్వీఆర్ కూడా ఒక‌రు. ఆమె జీవితంలో ఎన్నో మ‌లుపులకు ఆయ‌న కూడా ఓ కార‌ణ‌మే. అలాంటి పాత్ర కోసం మ‌రో మ‌హానటున్ని తీసుకున్నాడు నాగ్ అశ్విన్. ఆమె జ‌యంతి కానుక‌గా మ‌హాన‌టి డిసెంబ‌ర్ 6 మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు ఏదో స‌ర్ ప్రైజ్ ఇవ్వ‌బోతున్నారు మ‌హాన‌టి టీం.

సావిత్రి జీవితం ఎక్క‌డ మొద‌లై.. ఎలా ముగిసింది అనే ప్ర‌తీ చిన్న విష‌యాన్ని ఇందులో చూపించ‌బోతున్నాడు నాగ్ అశ్విన్. మ‌హాన‌టిలో సావిత్రి భ‌ర్త జెమినీ గ‌ణేష‌న్ పాత్ర‌లో మ‌ళ‌యాల కుర్ర హీరో దుల్క‌ర్ స‌ల్మాన్ న‌టిస్తున్నాడు. కీర్తిసురేష్, దుల్క‌ర్ పై ప్ర‌స్తుతం కీల‌క‌మైన స‌న్నివేశాలు చిత్రీక‌రిస్తున్నాడు ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్. సావిత్రి జీవితంలో వెలుగులు ఎన్ని ఉన్నాయో.. చీక‌టి కోణాలు కూడా అన్నే ఉన్నాయి. చివ‌రి రోజుల్లో ఆమె తాగుడుకు బానిసై మ‌ర‌ణించింది. వాట‌న్నింటినీ సినిమాలో చూపిస్తాడా అనేది ఆస‌క్తిక‌రంగా మారింది. అంతేకాదు.. అప్ప‌ట్లో ఎన్టీఆర్, ఏఎన్నార్ తో కూడా సావిత్రికి వివాదాలు వ‌చ్చాయి.

అయితే సావిత్రి చివ‌రి రోజుల్లో ఎలాంటి క‌ష్టాలు ప‌డ‌లేద‌ని.. ఎంతో హాయిగా ఉంద‌ని.. ఆమె సంపాదించిన దాంతో మ‌రో రెండు త‌రాలు కూర్చుని తినొచ్చు అని ఆమె కూతురు చెబుతుండ‌టం విశేషం. మ‌రి సావిత్రి జీవితాన్ని ఈ కుర్ర ద‌ర్శ‌కుడు ఎలా ఆవిష్క‌రించ‌బోతున్నాడ‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది. మొత్తానికి మ‌హాన‌టి చిత్రం ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది. వ‌చ్చే ఏడాది ఈ చిత్రం విడుద‌ల కానుంది.

More Related Stories