English   

చైనా మార్కెట్.. అలా ఎలా వ‌దిలేస్తాం..?

Why-People-Neglecting-China-Market

హాలీవుడ్ త‌ర్వాత అంత మార్కెట్ ఉన్న‌ది చైనాలోనే. అక్క‌డి సినిమాలు ఓ రేంజ్ లో వ‌సూలు చేస్తుంటాయి. పైగా 20 వేల థియేట‌ర్స్ ఉండ‌టంతో మంచి సినిమా కానీ ప‌డితే ఓ రేంజ్ లో వ‌సూళ్లు వ‌స్తాయి. ఒక్క‌సారి అక్క‌డ మార్కెట్ ఓపెన్ అయిందంటే హీరోల‌కు పండ‌గే. చైనా మార్కెట్ రుచి ఇప్ప‌టికే అమీర్ ఖాన్ కు బాగా ప‌రిచ‌యం. ఈయ‌న న‌టించిన పీకే, 3 ఇడియ‌ట్స్ అక్క‌డ విజ‌యం సాధించాయి. ఇక దంగ‌ల్ అయితే అక్ష‌రాలా 1200 కోట్లు క‌లెక్ట్ చేసింది. అయితే అక్క‌డ ట్యాక్స్ ప్ల‌స్ డిస్ట్రిబ్యూట‌ర్ షేర్ పోనూ మ‌న నిర్మాత‌ల‌కు వ‌చ్చింది కేవ‌లం 120 కోట్లే.. అది వేరే విష‌యం. కానీ వ‌సూళ్లైతే భారీగా వ‌చ్చాయి క‌దా అని ఇప్పుడు మిగిలిన వాళ్లు కూడా చైనా మార్కెట్ పై క‌న్నేసారు.

అమీర్ ఇచ్చిన ఉత్సాహంతో ఇప్పుడు స‌ల్మాన్ కూడా చైనా మార్కెట్ పై దండెత్త‌డానికి రెడీ అయ్యాడు. ఈయ‌న న‌టించిన భ‌జ‌రంగీ భాయీజాన్ చైనాలో విడుద‌ల కానుంది. ఈ చిత్రాన్ని అక్క‌డ లిటిల్ లోలిత మంకీ గాడ్ అంకుల్ పేరుతో అనువ‌దిస్తున్నారు. భ‌జ‌రంగీ భాయీజాన్ కూడా బాగా ఎమోష‌న‌ల్ స్టోరీ. 2015లో ఇక్క‌డ విడుద‌లైన సినిమా 600 కోట్లు వ‌సూలు చేసింది. పాక్ నుంచి త‌ప్పిపోయిన ఓ మూగ అమ్మాయిని తిరిగి త‌న ఇంటికి హీరో ఎలా చేర్చాడు అనేది క‌థ‌. ఇండియా పాక్ మ‌ధ్య వ‌చ్చిన స‌న్నివేశాల‌న్నీ హృద‌యాన్ని హ‌త్తుకునేలా ఉన్నాయి. ఈ చిత్రం చైనాలో కూడా విజ‌యం సాధిస్తుంద‌ని న‌మ్ముతున్నారు చిత్ర‌యూనిట్.

ఇక ర‌జినీకాంత్ 2.0 చైనాలో ఏకంగా 15000 థియేట‌ర్స్ లో విడుద‌ల కానుంది. ఇది నిజంగా ఓ రికార్డ్. 20000 థియేట‌ర్స్ ఉన్న చైనాలో 75 శాతం స్క్రీన్స్ లో 2.0నే వ‌స్తుంది. ఎప్రిల్ లో 2.0 విడుద‌ల కానుంది. ఇక్క‌డ మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం కూడా ఉంది. ఇప్ప‌టి వ‌ర‌కు చైనాలో కేవ‌లం అమీర్ ఖాన్ సినిమాల‌కు మాత్ర‌మే డిమాండ్ ఉంది. బాహుబ‌లిని చైనాలో విడుద‌ల చేసి చేతులు కాల్చుకున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. అంటే అక్క‌డి వాళ్ల‌కు మ‌న వార్ సినిమాలు పెద్ద‌గా న‌చ్చ‌వు. టెక్నాల‌జీ ఎక్కువ‌గా ఉన్నా.. విజువ‌ల్ ఎఫెక్ట్స్ అద్భుతంగా ఉన్న బాహుబ‌లిని కూడా వాళ్లు తిప్పికొట్టారు. ఈ లెక్క‌న 2.0 సైన్స్ ఫిక్ష‌న్ డ్రామా. ఇప్ప‌టికే అక్క‌డ ఇలాంటి సినిమాలు చాలానే వ‌చ్చుంటాయి. కానీ వాట‌న్నింటినీ మించి ఏదో ఉంద‌ని 2.0లో శంక‌ర్ చైనీయుల‌కు చూపించాలి. మొత్తానికి చూడాలిక‌.. ఈ సినిమాల‌న్నీ చైనీయుల‌ను ఆక‌ట్టుకుంటాయో లేదో..?

More Related Stories