English   

స‌ర్కార్ రివ్యూ

Sarkar-Review
2018-11-06 07:30:48

స‌ర్కార్.. పేరుతోనే ప్ర‌భుత్వం ఉంది. పైగా క‌త్తి, తుపాకి లాంటి సినిమాల త‌ర్వాత విజ‌య్, మురుగదాస్ కాంబినేష‌న్ లో వ‌చ్చిన హ్యాట్రిక్ మూవీ ఇది. దాంతో ఎలా ఉంటుందో అనే అంచ‌నాలు తెలుగులోనూ భారీగానే ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా వ‌చ్చేసింది.. మ‌రి అంచ‌నాల‌ను అందుకుందా..? 

క‌థ‌: 

సుంద‌ర్ రామ‌స్వామి(విజ‌య్) అమెరికాలో నెంబ‌ర్ వ‌న్ కార్పోరేట్ కంపెనీ జిఎల్ సిఈఓ. ఇండియాకు త‌న  ఓటు హ‌క్కు వినియోగించుకోడానికి వ‌స్తాడు. తీరా ఇక్క‌డికి వ‌చ్చిన త‌ర్వాత త‌న ఓటును ఎవ‌రో దొంగఓటుగా మార్చేసార‌ని తెలుసుకుంటాడు. అక్క‌డ్నుంచి త‌న పోరాటం మొద‌లు పెడ‌తాడు. ఆ పోరాటంలో అతడికి తోడు లీల‌(కీర్తిసురేష్) ఉంటుంది. కోర్టుకు వెళ్లి కోల్పోయిన త‌న ఓటును తెచ్చుకుంటాడు. అదే విధంగా ల‌క్ష‌ల మంది ఓట్లు దొంగఓట్లుగా మార్చ‌బ‌డ్డాయ‌ని తెలిసి అంతా క‌లిసి ఉద్యమం చేస్తారు. అప్పుడు రాజ‌కీయ నాయ‌కులు సుంద‌ర్ కు వ్య‌తిరేకంగా మార‌తారు. దాంతో త‌నే రాజ‌కీయాల్లోకి దిగుతాడు సుంద‌ర్. అప్ప‌ట్నుంచి స‌ర్కార్ ఎలా మారిపోయింది అనేది క‌థ‌.. 

క‌థ‌నం:

మురుగ‌దాస్ సినిమా అంటే సందేశాత్మ‌క క‌థ‌తో పాటు క‌మ‌ర్షియ‌ల్ అంశాలు కూడా చాలానే ఉంటాయి. అవి కూడా స‌రిగ్గా వండి ప్రేక్ష‌కుల‌కు పెడ‌తాడు మురుగ‌దాస్. విజ‌య్ తో గ‌తంలో చేసిన తుపాకి, క‌త్తి సినిమాల విష‌యంలోనూ ఇదే చేసాడు ఈ ద‌ర్శ‌కుడు. ప‌క్కాగా క‌మ‌ర్షియ‌ల్ అంశాల‌ను అందులో చేర్చాడు. అయితే ఈ సారి మాత్రం అది కాస్త మిస్ అయిన ఫీలింగ్ వ‌స్తుంది. క‌త్తి, తుపాకి కంటే బ‌ల‌మైన క‌థ‌ను స‌ర్కార్లో తీసుకున్నాడు మురుగ‌దాస్. ప్ర‌జ‌ల బ‌తుకు మార్చే ఓటు హ‌క్కు గురించి రాసుకున్న క‌థ ఇది. అయితే దీన్ని ఆస‌క్తిక‌రంగా తెర‌కెక్కించ‌డంలో మాత్రం ఎందుకో తెలియ‌దు కానీ మురుగ‌దాస్ త‌డ‌బడ్డాడు. ఫ‌స్టాఫ్ అంతా ఆయ‌న అమెరికా నుంచి రావ‌డం.. కోర్ట్ లో పోరాటం.. కోల్పోయిన ఓటు తిరిగి తెచ్చుకోవ‌డంతోనే అయిపోతుంది. ఇంట‌ర్వెల్ త‌ర్వాత అస‌లు క‌థ మొద‌ల‌వుతుంది. అయితే క‌థ చాలా బ‌లంగా ఉంటుంది.. సోష‌ల్ మెసేజ్ కూడా స్ట్రాంగ్ గానే ఇచ్చాడు మురుగ‌దాస్. కాక‌పోతే దాన్ని ఇంకాస్త మ‌సాలా ద‌ట్టించి ఇచ్చుంటే బాగుండేది. ఇష్యూ సీరియ‌స్ నెస్ పోకుండా మొత్తం అక్క‌డే క‌థ తిప్పాడు ద‌ర్శ‌కుడు. త‌మిళ‌నాట విజ‌య్ ఇమేజ్ తో అక్క‌డ ఇది వ‌ర్క‌వుట్ అవుతుందేమో కానీ తెలుగులో మాత్రం అంత సినిమా క‌నిపించ‌డం లేదు. ఇమేజ్ లేని విజ‌య్ ఇలాంటి మెసేజ్ లు ఇస్తే న‌వ్వుకుంటారే కానీ సీరియ‌స్ గా తీసుకోరు. అక్క‌డికీ త‌న న‌ట‌న‌తో సింగిల్ మ్యాన్ షో చేసాడు విజ‌య్. సెకండాఫ్ క‌థ ఉన్నా మ‌రీ రొటీన్ స్క్రీన్ ప్లేతో ఉసూరుమ‌నిపించాడు మురుగదాస్. కార్పోరేట్ క్రిమిన‌ల్ అంటూ అక్క‌డ‌క్క‌డా ఎత్తులు బాగానే వేసినా కూడా అవి నిల‌బెట్టేంత‌గా స‌రిపోలేదు. సినిమాలో కామెడీ అనేది లేక‌పోవ‌డం పెద్ద మైన‌స్. క‌నీసం అక్క‌డ‌క్క‌డా ఎంట‌ర్ టైన్మెంట్ ఉండుంటే బాగుండేది. ఓవ‌రాల్ గా ఈ స‌ర్కార్ క‌థ ఉంది.. కానీ క‌థ‌నం వీక్ గా ఉంది.. 

న‌టీన‌టులు:

విజ‌య్ మ‌రోసారి ఆక‌ట్టుకున్నాడు. త‌న‌కు ఇచ్చిన సుంద‌ర్ రామ‌స్వామి పాత్ర‌కు ప్రాణం పోసాడు. స‌ర్కార్ ను త‌న భుజాల‌పై మోసాడు. అత‌డి ఫ్యాన్స్ కు ఈ చిత్రం పండ‌గే. ఫ‌స్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వ‌ర‌కు ఆడుకున్నాడు విజ‌య్. కీర్తిసురేష్ జ‌స్ట్ విజ‌య్ అసిస్టెంట్ పాత్రకే స‌రిపోయింది. ఆమెకు ప్రాముఖ్య‌త లేని పాత్ర ఇచ్చాడు మురుగ‌దాస్. వ‌ర‌ల‌క్ష్మి కూడా అక్క‌డ‌క్క‌డా క‌నిపించే పాత్రే చేసింది. త‌న‌కు ఉన్న సీన్స్ మాత్రం బాగానే చేసింది. రాధార‌వి ఆక‌ట్టుకున్నాడు. ఈయ‌న పాత్రను మురుగ‌దాస్ బాగానే డీల్ చేసాడు. క‌మెడియ‌న్ యోగిబాబు ఉన్న కామెడీ లేదు. మిగిలిన వాళ్లంతా జ‌స్ట్ ఓకే. 

టెక్నిక‌ల్ టీం: 

ఏఆర్ రెహ‌మాన్ బ్యాగ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. పాట‌లు ఇక్క‌డ మ‌న ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకోలేదు కానీ త‌మిళ‌నాట ఓకే. మ‌న ద‌గ్గ‌ర ఒక్క పాట కూడా అర్థం కాలేదు. ఆర్ఆర్ మాత్రం అదిరిపోయింది. సినిమాటోగ్ర‌ఫ్ గిరీష్ వ‌ర్క్ బాగుంది. చాలా రిచ్ లుక్ లో సినిమా క‌నిపించింది. ఎడిట‌ర్ లోపాలు క‌నిపించాయి. కొన్ని చోట్ల సీన్స్ బోర్ కొట్టించారు. సాగ‌దీసిన‌ట్లు అనిపించింది. ద‌ర్శ‌కుడిగా మురుగ‌దాస్ స్పైడ‌ర్ దెబ్బ నుంచి ఇంకా కోలుకోలేదేమో అనిపిస్తుంది. అందుకే పూర్తిస్థాయి మురుగ‌దాస్ రాలేదు. క‌త్తి, తుపాకితో పోలిస్తే సర్కార్ స‌రిపోదు. అలాగ‌ని తీసిపారేసే సినిమా అయితే కాదు. కానీ క‌చ్చితంగా మురుగ‌దాస్ మార్క్ సినిమా కూడా కాదు. స‌న్ పిక్చ‌ర్స్ నిర్మాణ విలువ‌లు ఉన్నంత‌గా ఉన్నాయి. 

చివ‌ర‌గా: ఈ స‌ర్కార్.. కంటెంట్ స్ట్రాంగ్.. క‌థ‌నం వీక్.. 

రేటింగ్:  2.5/5.

More Related Stories