English   

కార్తి చెప్పింది నిజమే.. నా..?

Karthi-Dev
2018-11-06 17:35:00

కార్తీ.. తమిళ్ హీరోగా వచ్చినా తెలుగువారికీ మోస్ట్ ఫేవరెట్ హీరో అయిపోయాడు. ఫస్ట్ మూవీ నుంచి తనే డబ్బింగ్ చెప్పుకుంటూ ఆకట్టుకుంటోన్న కార్తీ.. రెగ్యులర్ గా తమిళ్ హీరోలు చెప్పినట్టుగా త్వరలోనే తెలుగు సినిమా చేస్తా అనే డైలాగ్ చెప్పకుండా ఏకంగా నాగార్జునతో కలిసి ‘ఊపిరి’ సినిమా కూడా చేశాడు. మొదట్లో చాలా వేగంగా తెలుగువారిని ఆకట్టుకున్న కార్తీ మంచి మార్కెట్ కూడా క్రియేట్ చేసుకున్నాడు. అందుకే అతని ప్రతి సినిమా తెలుగులోనూ విడుదలవుతోంది. మంచి ఓపెనింగ్స్ కూడా తెచ్చుకుంటుంది. దీంతో ఇప్పుడు కార్తీ ఓ కొత్త విషయం చెబుతున్నాడు. అందర్లా బతకాలని తనకు లేదట. తను వైవిధ్యంగా ఉంటానంటున్నాడు. అన్నట్టుగా ఆ ప్రయాణం కూడా మొదలుపెట్టాడు. 

"ఈ లోకంలో బతకడానికి ఎన్నో దార్లున్నాయి. ఎవరో చెప్పారని అర్థంకాని చదువు చదివి ఇష్టం లేని ఉద్యోగం చేసి ముక్కూ మొహం తెలియని ఓ నలుగురు మెచ్చుకోవాలని కష్టపడి పని చేసి ఈగో ప్రెషర్ కాంపిటీషన్ లో ఇరుక్కుని అంటీ అంటనట్టు లవ్ చేసి.. ఏం జరుగుతోందో అర్థం కాకుండా బతకడం ఓ దారి.. ఇంకో దారుంది.." అంటూ పాతదే అయినా ఈ ఫిలాసఫీని కొత్తగా చెబుతున్నాడు. ఒక రకంగా కార్తీ చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ నిజం. కానీ ఆ నిజంలో బ్రతుకుతున్న వారి శాతమే చాలా అంటే చాలా తక్కువ. అందుకే అది నిజమే అయినా నిజమని ఒప్పుకోలేని జీవితాలే చాలా ఉన్నాయి.. నేటి సమాజంలో.  ఇదంతా తన లేటెస్ట్ మూవీ ‘దేవ్’ సినిమా టీజర్ లోని డైలాగ్. అందర్లా కాకుండా తను మాత్రం తనకు నచ్చిన బైక్ రేసర్ గా కెరీర్ తీసుకున్నట్టు ఈ టీజర్ తో తెలుస్తోంది. తనకు నచ్చినట్టు బ్రతకడమే జీవితం అనే ఫైనల్ టచ్చే ఈ సినిమాలోనూ ఉంటుందనేలా టీజర్ చెప్పకనే చెబుతోంది. ఖాకీ తర్వాత రకుల్ ప్రీత్ సింగ్ మరోసారి కార్తీ సరసన నటిస్తోంది. రజత్ రవిశంకర్ డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీ ఈ యేడాదే విడుదల కాబోతోంది. మరి ఖాకీ తర్వాత మరోసారి కలిసిన కార్తీ అండ్ రకుల్ ఈ సారి కూడా హిట్ కొడతారేమో చూడాలి. 

More Related Stories