English   

అనుష్క కోసం వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు

Anushka Shetty Fans Waiting For her Next Movie Announcement : Happy Birthday Anushka
2018-11-07 14:34:10

అరుంధతిలా అదరగొట్టింది.. దేవసేనలా మెస్మరైజ్ చేసింది... రుద్రమదేవిలా రౌద్రం చూపింది.. భాగమతిలా భయపెట్టింది. ఇక ఇప్పుడు సైలెన్స్ గా పని చూసుకుంటోన్న అనుష్క బర్త్ డే ఇవాళ.  అనుష్కశెట్టి.. తొలి సినిమాలో సోయగాలతో సూపర్ అనిపించుకున్న బ్యూటీ. సెకండ్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చినా.. టాప్ హీరోయిన్ రేస్ కు కాస్త ఆలస్యంగా వచ్చినా.. ఇప్పుడు ప్రపంచమంతా తెలిసిన తొలి ప్రాంతీయభాషా చిత్ర హీరోయిన్ గా అవతరించింది. అందంగా వచ్చి ప్రతిభతో ఆకట్టుకున్న బ్యూటీ ఈ స్వీటీ.. అరుంధతిలా అదరగొట్టినా.. దేవసేనలా డివైన్ బ్యూటీ అనిపించినా.. భాగమతిలా భయపెట్టినా.. అది అనుష్కకే చెల్లింది.

అనుష్క.. పుట్టింది కర్ణాటక రాష్ట్రంలో. 2005లో పూరీ జగన్నాథ్ డైరెక్ట్ చేసిన సూపర్ సినిమాతో వెండితెరపై అడుగు పెట్టింది. ఫస్ట్ మూవీలో కేవలం అందాల ప్రదర్శనకే పరిమితమైనా చాలా కాన్ఫిడెంట్ గా కనిపించింది. తర్వాత కొన్ని సినిమాలు చేసినా రాజమౌళి డైరెక్ట్ చేసిన విక్రమార్కుడుతో అమ్మడికి మంచి క్రేజ్ వచ్చింది. కానీ ఆ క్రేజ్ గ్లామర్ డాళ్ ఇమేజ్ కే పరిమితం చేసింది. అనుష్క మొదట తెలుగు తెరపై అడుగుపెట్టింది. ఆ తర్వాత కోలీవుడ్ లోనూ స్టెప్పులు వేసింది. అయితే ఈ రెండు సందర్భాల్లోనూ తను కేవలం రెగ్యులర్ హీరోయిన్ గా మాత్రమే ఆగిపోయింది. విక్రమార్కుడు తర్వాత ఆఫర్స్ వచ్చినా.. అవన్నీ కేవలం స్కిన్ షోకు పరిమితమైన సినిమాలు. అప్పటికే టాప్ హీరోయిన్ రేస్ లో చాలామంది భామలున్నారు. ఆ టైమ్ లో వచ్చిన అనుష్కకు ఆఫర్స్ ఆగలేదు కానీ,  విక్రమార్కుడు తర్వాత తెలుగు, తమిళ్ లో మళ్లీ పెద్ద బ్రేక్ ఇచ్చిన సినిమాలు లేవు.

బాలకృష్ణ, నాగార్జున వంటి స్టార్స్ తో పనిచేసింది. స్టాలిన్ లో చిరంజీవి సరసన ఓ ఐటెమ్ సాంగ్ కూడా చేసింది అనుష్క. కానీ బ్రేక్ రాలేదు. ఈ టైమ్ లో కోడి రామకృష్ణ దర్శకత్వంలో చేసిన సినిమా ఆమె సినిమా కెరీర్ నే మోస్ట్ మెమరబుల్ గా మార్చేసింది. అదే అరుంధతి. అరుంధతి, జేజెమ్మగా అనుష్క నటనకు ఆడియన్స్ ఫిదా అయిపోయారు. అప్పటి వరకూ కేవలం స్కిన్ షోకే పరిమితమైన స్వీటీ ఈ రేంజ్ లో పర్ఫార్మెన్స్ కూడా చేయగలదని అప్పటి వరకూ తెలియదు. అరుంధతి బిగ్గెస్ట్ హిట్ కొట్టి. తెలుగులో మళ్లీ లేడీ ఓరియండెటెడ్ సినిమాలకు కొత్త దారి చూపింది. అరుంధతి అన్ని భాషల్లో డబ్ అయింది. అక్కడా సూపర్ హిట్ గా నిలిచింది. దీంతో తనకు ఆఫర్స్ పెరిగాయి. కానీ అనూహ్యంగా బిల్లా సినిమాలో బికినీ వేసి సర్ ప్రైజ్ చేసింది. అరుంధతి నుంచి సడెన్ గా బిల్లాలో బికినీ వేసినప్పుడే చాలామంది ఊహించారు. తను కేవలం అరుంధతి టైప్ సినిమాలే చేస్తే ఇక కెరీర్ ఆగిపోతుంది. అందుకే ఇలా చేసిందని. అదీ నిజమే. తను వెంటనే బిల్లా వంటి సినిమాలు చేసి ఉండకపోతే ఆ హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలతో తన కెరీర్ ఎప్పుడో ఆగిపోయేది.

బిల్లా తర్వాత తమిళ్ లో ఎక్కువగా ఫోకస్ పెట్టింది. అక్కడ ఫస్ట్ హిట్ గా సింగం వచ్చింది. ఈ టైమ్ లో తెలుగులో మరో సాహసం చేసింది అనుష్క. అరుంధతి తర్వాత టాప్ హీరోయిన్ గా మారిన అనుష్క సడెన్ గా వేశ్య పాత్రలో నటించేందుకు ఒప్పుకుంది. యస్.. అప్పటికి ఒకే సినిమా తీసిన దర్శకుడు క్రిష్ తో వేదం సినిమా చేసింది. ఈ సినిమాలో స్కిన్ షో కాస్త ఎక్కువైందనిపించినా.. నటనతోనూ మెస్మరైజ్ చేసింది.. పాత్ర నచ్చితే ఎలాంటి క్యారెక్టర్ అయిన ఓకే అనే ఇండికేషన్స్ వేదంతో తెలిపింది.. వేదం తర్వాత వరుసగా కొన్ని సినిమాలు చేసింది. వీటిలో మరోసారి అరుంధతి పోస్టర్స్ ను తలపించే పంచాక్షరి వంటి సినిమాతో పాటు మహేష్ బాబుతో చేసిన ఖలేజా కూడా ఉంది. అలాగే నాగ్ తో చేసిన రగడ, ఢమరుకం కూడా పెద్దగా ఆడలేదు. అటు తమిళ్ లోనూ సేమ్ సిట్యుయేషన్. దీంతో తన కెరీర్ ప్రమాదంలో పడినట్టే అనుకున్నారు. కానీ ప్రభాస్ తో చేసిన మిర్చితో మళ్లీ ఫామ్ లోకి వచ్చింది. ఇదే టైమ్ లో అటు తమిళ్ లో సింగం-2తో మరో హిట్ పడింది. కానీ రజినీకాంత్ సరసన చేసిన లింగా బాగా నిరాశపరిచింది. అలాగే అజిత్ సరసన చేసిన ఎన్నై అరిందాల్ ఆకట్టుకుంది.

ఏ నటికైనా కెరీర్ బెస్ట్ అనేది ఉంటుంది. అది అనుష్క ఆల్రెడీ అరుంధతితో చేసింది. కానీ తన ఇమేజ్ ను వాల్డ్ వైడ్ గా స్ప్రెడ్ చేసిన బాహుబలి. ప్రభాస్ వంటి స్టార్ కు తల్లిగానూ, భార్యగానూ నటించేందుకు ఒప్పుకుందంటే అది దర్శకుడు ఇచ్చిన ధైర్యమే అయినా.. చేయడానికి కూడా గట్స్ కావాలి. యాక్టింగ్ పరంగా అప్పటికే టాప్ స్కోర్ చేసిన అనుష్క దేవసేనగా రెండు వేరియేషన్స్ ఉన్న పాత్రల్లో సింప్లీ సూపర్బ్ అనిపించుకుని.. తనను తప్ప ఆ పాత్రలో మరెవరినీ ఊహించుకునే ఛాన్స్ కూడా ఇవ్వలేదు. బాహుబలి వంటి సినిమాలో పార్ట్ కావాలని ఎంతోమంది కలలు కన్నారు. కానీ ఆ సినిమాలో అత్యంత కీలకమైన పాత్రలో రాణించి ప్రపంచ వ్యాప్తంగా తిరుగులేని మార్కులు కొట్టేసింది అనుష్క. కాకపోతే బాహుబలి ద బిగెనింగ్ తర్వాత చేసిన మిస్టేక్ తన కెరీర్ కే శాపంగా మారింది. ఆ టైమ్ లో తను చేసిన సైజ్ జీరో సినిమా.. పెద్ద మైనస్ అయింది. ఆ సినిమా ఆడకపోగా.. మూవీ కోసం తను పెరిగిన వెయిట్ కారణంగా ఇప్పుడు చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తోంది. ఈ బరువు వల్లే బాహుబలి -2లో ఇంకాస్త మంచి పోర్షన్ కోల్పోయిందనేవారూ ఉన్నారు.

హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలకు పర్ఫెక్ట్ గా సూట్ అయ్యే పర్ఫార్మెన్సే కాదు.. ఫిజిక్ కూడా స్వీటీ సొంతం. అందుకే కాకతీయ రాణి రుద్రమదేవి కథను తెరకెక్కించాలనుకున్నప్పుడు గుణశేఖర్ కు వేరే ఆప్షన్ లేకుండా పోయింది. రుద్రమదేవిగానూ రౌద్రం చూపించి ఔరా అనిపించిందీ బ్యూటీ. ఇక కాస్త ఒళ్లు చేసినా.. అదే ఎస్సెట్ గా మరోసారి తనే ప్రధాన పాత్రలో భాగమతిగా వచ్చింది. బాహుబలి తర్వాత వచ్చిన ఈ సినిమా మంచి హిట్ గా నిలిచింది. కొన్ని అక్రమాలకు సాక్ష్యంగా నిలిచిన ఐఏఎస్ అధికారణిగా.. తనకు తెలిసిన మ్యాజిక్స్ తో విలన్ ఆటకట్టించే భాగమతిగా తన నటన మరోసారి మెస్మరైజ్ చేసింది. భాగమతి తర్వాత ఇప్పటికి ఇంకో మూవీ ఒప్పుకోలేదు అనుష్క. ఆమె నెక్స్ట్ మూవీ అనౌన్స్మెంట్ కోసం వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు అనుష్క అభిమానులు.

More Related Stories