English   

థ‌గ్స్ ఆఫ్ హిందుస్తాన్ రివ్యూ

Thugs-Of-Hindostan
2018-11-08 07:32:09

అమీర్ ఖాన్ సినిమా అంటే అంచ‌నాలు ఎలా ఉంటాయో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఇప్పుడు థ‌గ్స్ ఆఫ్ హిందుస్తాన్ తో వ‌చ్చాడు అమీర్ ఖాన్. మ‌రి ఈ చిత్రం ఎలా ఉంది..? అంచ‌నాలు అందుకుందా.. లేదంటే త‌డ‌బ‌డిందా..? 

క‌థ‌:

1795లో వ్యాపార నిమిత్తం ఇండియాకు వ‌చ్చి అంత‌టా త‌మ జెండా పాతేస్తారు బ్రిటీష‌ర్స్. కానీ ఒక్క రోన‌క్ పూర్ మిర్కా చ‌క్ర‌వ‌ర్తి రాజ్యంలో త‌ప్ప‌. దాంతో అక్క‌డికి కూడా వ‌చ్చి క్లైవ్ అనే రాజు త‌న బ్రిటీష్ సైన్యంతో రోన‌క్ పూర్ ను సొంతం చేసుకుని.. అంద‌ర్నీ చంపేస్తాడు. అప్పుడు ఆ రాజ్యం యువ‌రాణి జ‌హీరా(ఫాతిమా)ను ఆ రాజ్య సైన్యాధ్యుక్షుడు ఆజాద్(అమితాబ్) కాపాడతాడు. ఆ త‌ర్వాత బ్రిటీష‌ర్స్ తో స్వాతంత్ర్యం కోసం పోరాటం చేస్తూ వాళ్ల ధ‌నాన్ని దొంగిలిస్తుంటారు. అలాంటి స‌మ‌యంలో వాళ్ల‌కు ఫిరంగీ(అమీర్ ఖాన్)తో ప‌రిచ‌యం అవుతుంది. ఆయ‌న సాయంతో ఎలా వాళ్లు బ్రిటీష్ సామ్రాజ్యాన్ని మట్టుపెట్టి త‌మ రాజ్యాన్ని ద‌క్కించుకున్నారు అనేది క‌థ‌.

క‌థ‌నం:

సాధార‌ణంగా ఇలాంటి సినిమాల‌కు విజువ‌ల్ వండ‌ర్ కంటే ముందు ఎమోష‌న్స్ కీల‌కం. ప్ర‌ధానంగా అలాంటి సీన్స్ వ‌చ్చిన‌పుడు మాత్ర‌మే ప్రేక్ష‌కులు కూడా ఎక్కువ‌గా క‌నెక్ట్ అవుతుంటారు. మ‌రీ ముఖ్యంగా బ్రిటీష్ సైన్యం అన‌గానే మ‌న‌కు తెలియ‌కుండానే ఏదో ఎమోష‌న్ వ‌చ్చేస్తుంది. గ‌తంలో చాలా సినిమాల్లో ఇది క్యాష్ చేసుకున్నారు మ‌న ద‌ర్శ‌కులు కానీ ఇఈ సారి మాత్రం అది క‌నిపించ‌లేదు. ఆజాద్ కోసం పోరాటం అంటూనే అమీర్ ఖాన్ కారెక్ట‌ర్ అంతా కామెడీ చేస్తుంటుంది. అత‌డి కారెక్ట‌ర్లో ఎందుకో లాజిక్స్ మిస్ అవుతుంటాయి. ఫ‌స్టాఫ్ లో కాస్త కామెడీతో నెట్టుకొచ్చిన ద‌ర్శ‌కుడు.. ఎక్కువ‌గా యాక్ష‌న్ సీన్స్ పైనే ఫోకస్ చేసాడు. విజువ‌ల్ ఎఫెక్ట్స్ కు తోడు యాక్ష‌న్ సీన్స్ మాత్రం అదిరిపోయాయి. స్లోగా సాగుతున్న క‌థ‌లో అవి మాత్రమే కాస్త ఉప‌శ‌మ‌నం. ఇంట‌ర్వెల్ వ‌ర‌కు క‌థ ఎలాంటి మ‌లుపులు లేకుండా సాగింది. 

అక్క‌డ్నుంచి మ‌రో మ‌లుపు తీసుకుని కాస్త ఎమోష‌న‌ల్ క‌నెక్ష‌న్ ఇచ్చేందుకు ట్రై చేసాడు ద‌ర్శ‌కుడు కానీ కుద‌ర్లేదు. అమితాబ్ బ‌చ్చ‌న్ యుద్ధ స‌న్నివేశాలు ఒక్క‌టి బాగా అనిపిస్తాయి ఎందుకో తెలియ‌దు కానీ అమీర్ క‌నిపించిన‌పుడు మాత్రం సినిమా పేస్ త‌గ్గిపోయింది.  సెకండాఫ్ కూడా మ‌రీ రొటీన్ స్క్రీన్ ప్లేతో బోర్ కొట్టించాడు ద‌ర్శ‌కుడు. నెక్ట్స్ వ‌చ్చే సీన్ కూడా ముందే అర్థ‌మైపోయేంత ఈజీ స్క్రీన్ ప్లే ఉంద‌క్క‌డ‌. క్లైమాక్స్ అయితే ఏదో ఉంటుంద‌ని చెప్పి ఇట్టే తేల్చేసాడు ద‌ర్శ‌కుడు విజ‌య్. అక్క‌డ‌క్క‌డా మెరిసే యాక్ష‌న్ సీన్స్ త‌ప్ప థ‌గ్స్ ఆఫ్ హిందుస్తాన్ లో గూస్ బంప్స్ తెప్పించే సీన్స్ మాత్రం ఒక్క‌టి కూడా లేవు. అదే పెద్ద మైన‌స్ సినిమాకు. దివాళి సంద‌ర్భంగా ఓపెనింగ్స్ వ‌స్తాయేమో కానీ నిల‌బ‌డేంత విష‌యం మాత్రం క‌నిపించ‌లేదు. 

న‌టీన‌టులు:

అమీర్ ఖాన్ న‌ట‌న‌కు పేరు పెట్టాల్సిన ప‌నిలేదు. అయితే క‌థ విష‌యంలో ఎప్పుడూ చాలా జాగ్ర‌త్త‌గా ఉండే అమీర్ ఈ సారి త‌డ‌బ‌డ్డాడు. ధూమ్ 3 లాంటి రొటీన్ సినిమాలో అమీర్ ను చూపించిన విజ‌య్ ఈ సారి కూడా ఇదే చేసాడు. త‌న పాత్ర‌లో వేరియేష‌న్ చూసి ఒప్పుకున్నాడేమో కానీ క‌థ‌లో కూడా వేరియేష‌న్ ఉంటే బాగుండేది. ఆజాద్ పాత్ర‌లో అమితాబ్ ప్రాణం పెట్టాడు. ఆయ‌న పాత్ర సినిమాకు కీల‌కం. క‌త్రినా కైఫ్ కు క‌థ‌తో సంబంధం లేదు కేవ‌లం రెండు పాట‌లు చేసిందంతే. ఫాతిమా స‌నా షేక్ జ‌హీరా పాత్ర‌లో బాగా న‌టించింది. యాక్ష‌న్ సీన్స్ లో కుమ్మేసింది. మిగిలిన వాళ్లంతా మ‌న‌కు తెలియ‌ని మొహాలే.

టెక్నిక‌ల్ టీం:

అజ‌య్ అతుల్ జాన్ స్టీవెర్ట్ అందించిన సంగీతం ప‌ర్లేదు.. ఆర్ఆర్ బాగుంది. ఎడిటింగ్ చాలా వీక్. చాలా స‌న్నివేశాలు బోర్ కొట్టించాయి. ముఖ్యంగా సెకండాఫ్ చాలా వీక్.. నెరేష‌న్ కూడా స్లోగా ఉంటుంది. అదే ప్ర‌ధాన స‌మ‌స్య సినిమాకు. విజువ‌ల్ ఎఫెక్ట్స్ మాత్రం అద్భుతంగా ఉన్నాయి. ఏదైనా అద్భుతం జ‌రిగి సినిమా బ‌య‌ట‌ప‌డిందంటే దానికి కార‌ణం విఎఫ్ఎక్స్. ఇక ద‌ర్శ‌కుడు విజ‌య్ కృష్ణ ఆచార్య మ‌రోసారి ధూమ్ 3 త‌ర‌హాలో క‌థ‌ను కాకుండా అమీర్ ఖాన్ బ్రాండ్ న‌మ్ముకున్నాడు. నాసీర‌కం క‌థ‌కు భారీ బ‌డ్జెట్ పెట్టించాడు. య‌శ్ రాజ్ ఫిల్మ్స్ నిర్మాణ విలువ‌లు మ‌రో స్థాయిలో ఉన్నాయి. 

చివ‌ర‌గా: థ‌గ్స్ ఆఫ్ హిందుస్తాన్.. విజువ‌ల్ ఫుల్.. విష‌యం నిల్.. 

రేటింగ్:  1/5.

More Related Stories