నా దూకుడు.. సాటెవ్వడూ అంటున్న వరుణ్ తేజ్

మెగా ఫ్యామిలీ నుంచి నయా స్టార్ పుట్టుకొచ్చాడు ఇప్పుడు. అతడి పేరు వరుణ్ తేజ్. ఏడాదిన్నర కింది వరకు ఒక్క హిట్ కూడా లేదు ఈ హీరోకు. ఈ కుర్ర హీరో అసలు హీరోగా నిలబడతాడా అనే అనుమానాలు కూడా వచ్చాయి. కానీ ఫిదాతో సగం.. తొలిప్రేమతో మరో సగం అనుమానాలు అందరికీ తీర్చేసాడు వరుణ్ తేజ్. తాను పక్కా హీరో మెటీరియల్ అని ప్రూవ్ చేసుకున్నాడు. ప్రస్తుతం సంకల్ప్ రెడ్డితో అంతరిక్షం సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రం డిసెంబర్ 21న విడుదల కానుంది. దీనిపై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. ఈ చిత్రాన్ని 25 కోట్లతో నిర్మిస్తున్నాడు దర్శకుడు క్రిష్. దాంతోపాటు ఎఫ్ 2లోనూ నటిస్తున్నాడు. వెంకటేశ్ ఇందులో మరో హీరో. అనిల్ రావిపూడి దర్శకుడు. ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తుండటం విశేషం. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఎఫ్ 2 విడుదల కానుంది. ఈ చిత్రం కూడా కచ్చితంగా బాగానే ఆడుతుందని చెప్తున్నాడు వరుణ్ తేజ్. ఈ రెండు సినిమాలు 20 రోజుల గ్యాప్ లోనే విడుదల కానున్నాయి. అయినా కూడా ధైర్యంగానే ఉన్నాడు వరుణ్ తేజ్. ఇవే తన కెరీర్ రేంజ్ ను డిసైడ్ చేస్తాయని తెలుసు.. అందుకే కచ్చితంగా ఇవి బాగుంటాయని చెబుతున్నాడు ఈ కుర్ర హీరో.
ఇక ఈ రెండు సినిమాలతో పాటు సాగర్ చంద్ర దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ చిత్రంలో వరుణ్ రోల్ మాస్ గా ఉంటుందని తెలుస్తుంది. రమ్యకృష్ణ ఇందులో కీలకపాత్రలో నటించబోతుంది. దానికితోడు మరో సినిమాకు కూడా ఈయన సై అనేసాడు. గీతాఆర్ట్స్ లోనే ఈ చిత్రం ఉంటుందని తెలుస్తుంది. ఇలా వరస సినిమాలతో బిజీగా ఉన్న వరుణ్ తేజ్.. ఈ మధ్య బ్రాండ్ అంబాసిడర్ కూడా అయ్యాడు. ఈయన తన తొలి బ్రాండ్ ఆర్ఎస్ బ్రదర్స్ కు సైన్ చేసాడు. ఇప్పటి వరకు ఎండోర్స్ మెంట్ అనుభవం లేని వరుణ్ తేజ్.. మా బట్టల షాప్ కు రండి.. నచ్చిన బట్టలు తీసుకుని పోండి అంటూ బాగానే చెప్పాడు. ఇవన్నీ ఇలా ఉంటూనే మరోవైపు హీరోగా కూడా తన మార్కెట్ పెంచుకుంటున్నాడు. అన్నింటికీ మించి ఒకే తరహా రోల్స్ కాకుండా అన్ని చేస్తూ ఆల్ రౌండర్ అనిపించుకుంటున్నాడు. ఏదేమైనా ఇప్పుడు వరుణ్ తేజ్ దూకుడు మెగా కుటుంబానికి సంతోషం ఇచ్చే విషయమే.