English   

స్టార్ హీరోల అభిమానులు హద్దు మీరుతున్నారా..?

Star-Heros
2018-11-20 07:59:53

ఈ మాట కొన్నాళ్లుగా బాగా వినిపిస్తోంది.. స్టార్ హీరోల అభిమానులు హద్దు మీరుతున్నారా అని.. నిజమే.. సోషల్ మీడియా ఎక్కువైన తర్వాత ఈ విషయం మరీ ఓవర్ అయిపోయింది. ఒక స్టార్ హీరో ఉంటాడు. ఏదో మీటింగ్ లోనో, ఇంటర్వ్యూలోనో అతను తనకు ఫలానా హీరో అంటే ఇష్టం అంటాడు. అంతే.. ఇక ఆ హీరో కాకుండా ఇతర హీరోల అభిమానులు ఇక ఈయన్ని టార్గెట్ చేస్తారు. సోషల్ మీడియాలో రకరకాలుగా ట్రోలింగ్ మొదలుపెడతారు. అదే సమయంలో ఎవరైతే ఆ హీరో ఇష్టం అన్నాడో.. ఆ హీరో అభిమానులు అలా చెప్పిన హీరోను పొగుడుతూ వీళ్లతో ఫైట్ కు దిగుతారు. అయితే ఇది కాస్త ఆరోగ్యకరంగా ఉంటే ఫర్వాలేదు. కానీ బండబూతులు తిట్టుకుంటూ ఏ మాత్రం వినకూడని భాషలో వాళ్లు పోట్లాడేసుకునే విధానం ఈ మధ్య మరీ శ్రుతి మించింది. 

నిజానికి సోషల్ మీడియా వరకూ వచ్చారంటే వాళ్లంతా ఖచ్చితంగా ఎంతోకొంత చదువుకున్నవాళ్లే అయి ఉంటారు. కానీ ఆ సంస్కారం వారి భాషలో కానీ ప్రవర్తనలో కానీ ఎక్కడా కనిపించదు సరికదా.. అస్సలేమాత్రం చదువే లేని మనుషులే నయం అనుకునేలా.. దారుణమైన ప్రవర్తనతో ఉంటారు. నిజంగా ఇది ఆక్షేపణీయం.  కొన్నాళ్ల క్రితం ఓ అప్ కమింగ్ స్టార్ హీరో తన సినిమా రిలీజ్ డేట్ గురించి ఓ రెండు మూడు ఆప్సన్స్ ఇచ్చాడు. అంతే ‘మా అన్న సినిమాపై పోటీకి వస్తావా’ అంటూ పాపం ఆ హీరోను ఇప్పటికీ ఆడేసుకుంటున్నారు. అసలే బ్యాక్ గ్రౌండ్ లేని వాడతను. కానీ వీళ్లు చేసే నీచమైన కమెంట్స్ ఏ స్థాయిలో ఉన్నాయంటే అతని లేటెస్ట్ సినిమాకు మంచి రివ్యూస్, పాజిటివ్ టాక్ వచ్చింది. మొదటి రోజే పెట్టుబడి తెచ్చింది. అయినా ‘‘ఆ సినిమా షెడ్డుకు పోయిందటగా’’.., ‘‘కార్ పచ్చడైపోయిందటగా’’ అంటూ సోషల్ మీడియాలో చేస్తోన్న కమెంట్స్ చూస్తే అసలు వీరికి సినిమా అంటే తెలుసా అనిపిస్తుంది. వాళ్లు ఒక సూపర్ స్టార్ అభిమానులు.. అతను నిన్నామొన్నా వచ్చిన కుర్రాడు.. అతను పోటీకి దిగితే మాత్రం వారి స్టార్ భయపడతాడా..? లేక అతను పోటీకి వస్తే లాస్ అని వీళ్లు భయపడుతున్నారా అనిపించకమానదు. 

ఇలా ఫలానా హీరో అభిమానులు అని కాదు.. ప్రతి స్టార్ హీరో అభిమానులూ ఇలాగే ఉన్నారు. పవన్ కళ్యాణ్ నుంచి నిన్నా మొన్న వచ్చిన విజయ్ దేవరకొండ అభిమానుల వరకూ ఈ విషయంలో ఎవరూ మినహాయింపు కాదు. మాటకు ముందు బూతు, తర్వాత బూతు.. ఇలా ఉంటుంది వీరి అభిమానపు నీతి. నీచం అనే పదం కంటే కూడా ఎక్కువ అనేలా ఉంటాయి కొందరి పోస్టులైతే.. అయితే ఈ విషయం ఆయా హీరోలకు తెలుసు అనలేం. కానీ తెలుసుకోవాలి. సోషల్ మీడియాలో వీరి బూతుల రచ్చకు హద్దు లేకుండా పోతోంది. అదేమంటే వాడు మా హీరోనే అంటాడా అంటాడొకడు.. మీ హీరోకు అంత సీన్ లేదంటాడింకొకడు.. వీళ్లెంత దిగజారి మాట్లాడతారంటే ఆయా హీరోల ఇంటి ఆడవాళ్లను కూడా కామెంట్స్ లోకి దించుతారు. అత్యంత జుగుప్సాకరకమైన భాషలో కామెంట్స్ చేస్తుంటారు.. దీనికి అభిమానం అనే పదం ఒకటి అడ్డం పెడుతూ అడ్డగోలుగా మాట్లాడేస్తుంటారు. 

విషాదం ఏంటంటే.. ఈ లిస్ట్ లో కొందరు మీడియాలో పనిచేస్తోన్న అభిమానులూ ఉండటం. మా హీరోను అంటారా అంటూ వాళ్లు చేసే హడావిడీ(కాకపోతే వీళ్లు కాస్త బూతుల డోస్ తగ్గిస్తారంతే) చూస్తే.. నిజంగా వీళ్ల తల్లిదండ్రులు వీరికి సంస్కారం అనేది ఏదైనా నేర్పారా అనిపించక మానదు..  ఇక ఆయా హీరోలంతా మేం ఫ్రెండ్స్ అనుకుంటూ.. ‘‘మేం బావుంటాం.. మీరే బావుండాలి’’ అని చెబుతున్నా.. సరే.. వినరు. నిజంగా ఇది ఎంత దారుణంగా తయారైందంటే.. సమాజంలో జరిగే ఈ విషయంపైనా స్పందించని వాళ్లు కూడా హీరోల విషయంలో వీర లెవెల్లో ఘోరమైన బూతులతో సిద్ధపడతాడు. సోషల్ మీడియా అయినా ఇలాంటి వ్యక్తులపై ఓ నజర్ వేయాలి. ఆయా హీరోలు కూడా తమ అభిమానులం అని చెప్పుకుంటూ వాళ్లు చేస్తోన్న పనులపై వారి పర్సనల్ వింగ్స్ ను అయినా అలెర్ట్ చేసి పోటీ హెల్దీగా ఉండేలా చూసుకోవాలి.. లేదంటే ఇలాంటి తలతిక్క మనుషులతోనే సోషల్ మీడియా ఏదో రోజు బూతు మీడియాగా మారిపోతుంది. 

More Related Stories