నాని జెర్సీ వేసుకునేది అప్పుడే..

వరసగా 8 విజయాలతో ఉన్న నానికి 2018 అస్సలు కలిసిరాలేదు. ఈ ఏడాది వచ్చిన రెండు సినిమాలు ఫ్లాపులు అయ్యాయి. దాంతో మళ్లీ నార్మల్ హీరో అయిపోయాడు న్యాచురల్ స్టార్. కృష్ణార్జున యుద్దంతో పాటు పాజిటివ్ టాక్ తెచ్చుకున్న దేవదాస్ సైతం ఫ్లాప్ కావడంతో ఇప్పుడు నాని ఆలోచనలో పడిపోయాడు. ప్రస్తుతం జెర్సీ సినిమాలో నటిస్తున్నాడు ఈ హీరో. ఈ చిత్ర షూటింగ్ కూడా ఇప్పటికే మొదలైంది. మళ్లీరావా ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకుడు. ఇండియన్ టీంలోకి రావాలనుకుని కలలు కనే ఓ కుర్రాడి కథ ఇది. ఇప్పటి కథ కాదు.. 80ల్లో నేపథ్యం తీసుకుని ఈ చిత్రం తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు గౌతమ్. ఎమోషనల్ ఎంటర్ టైనర్ గా ఉండే ఈ చిత్రంతో కచ్చితంగా మళ్లీ తాను హిట్ కొడతానని ధీమాగా చెబుతున్నాడు నాని. ఇక ఇప్పుడు ఈ చిత్ర విడుదల తేదీ కూడా అనౌన్స్ చేసాడు నాని. ఇంకా 146 రోజుల్లో మీ ముందుకు వస్తున్నానంటూ జెర్సీ రిలీజ్ డేట్ పోస్టర్ వచ్చేసింది. ఎప్రిల్ 19, 2019న జెర్సీ విడుదల కానుంది. దానికి రెండు వారాల ముందు మహేష్ బాబు మహర్షి వస్తుంది. అందుకే తెలివిగా రెండు వారాలు గ్యాప్ తీసుకుని వస్తున్నాడు నాని. ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు నటిస్తున్నారు. ఇప్పటికే 30 శాతం షూటింగ్ కూడా పూర్తైపోయింది. జెర్సీ కోసం ప్రత్యేకంగా క్రికెట్ ప్రాక్టీస్ చేస్తున్నాడు నాని. సితార ఎంటర్ టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. అజ్ఞాతవాసి తర్వాత అనిరుధ్ స్వరాలందిస్తున్న తెలుగు సినిమా ఇదే. మరి చూడాలిక.. నానికి ఈ చిత్రం హ్యాట్రిక్ ఫ్లాపులను ఇస్తుందో.. లేదంటే సరికొత్త ఇన్నింగ్స్ గా మారుతుందో..?