అక్కకు ప్రేమతో.. సెంటిమెంట్ వర్కవుట్ కాలేదు..

అక్కకు ప్రేమతో అంటూ ఎన్టీఆర్ ను ఎన్నికల ప్రచారానికి తీసుకురావాలని చంద్రబాబు మాస్టర్ ప్లాన్ వేసారు కానీ అది వర్కవుట్ అయినట్లుగా అనిపించడం లేదు. ఎందుకంటే ఎన్టీఆర్ తెలంగాణలో కానీ.. ఆంధ్రాలో కానీ ఎన్నికల ప్రచారం చేయనని చెప్పేసాడు. కూకట్ పల్లిలో ఆయన అక్క సుహాసిని తరఫున ప్రచారం చేస్తాడనే వార్తలు చాలా రోజులుగా వస్తున్నాయి. ఆయనతో పాటు తారకరత్న.. కళ్యాణ్ రామ్ కూడా వచ్చేస్తారనే టాక్ వినిపించింది. హరికృష్ణ కూడా లేడు కదా.. ఏమో అక్కకు సపోర్ట్ గా తమ్ముడు వచ్చి ప్రచారం చేస్తాడేమో అనుకున్నారంతా. కానీ ఇప్పుడు అది కూడా జరగడం లేదు. కావాలంటే అక్కకు ఏ విధంగా అయినా సాయం చేయడానికి సిద్ధమే కానీ రాజకీయాలు మాత్రం వద్దు అంటున్నాడు జూనియర్. 2009 ఇచ్చిన షాక్ తర్వాత ఇప్పటి వరకు ఈయన కోలుకోలేపపోతున్నాడు. అప్పుడు ఆయన్ని వాడుకుని వదిలేసారనే విమర్శలు కూడా ఉన్నాయి. దాంతో అప్పట్నుంచి ఇప్పటి వరకు ఎంతమంది అడిగినా కూడా ఎన్టీఆర్ మాత్రం మనసు మార్చుకోవడం లేదు. ఇప్పుడు కూడా అక్క కోసం వస్తాడేమో అనుకుంటే మరోసారి సారీ అని చెప్పి వదిలేసాడు జూనియర్.