మళ్లీ అలా మారిపోతున్న జూనియర్ ఎన్టీఆర్..

కెరీర్ కొత్తలో ఎన్టీఆర్ ఎలా ఉండేవాడో ఒక్కసారి ఊహించుకోండి. సున్నుండ గుర్తొస్తుంది కదా.. నిండుగా చూడ్డానికి బొద్దుగా ముద్దుగా ఉండేవాడు జూనియర్. కానీ మొదట్లో బాగానే అనిపించినా.. రాఖీ టైమ్ వచ్చేసరికి మరీ చూడ్డానికి కూడా ఇబ్బందిగా అనిపించేంత బరువు పెరిగిపోయాడు ఎన్టీఆర్. అది చూసిన తర్వాతే ఎన్టీఆర్ తో చెమటలు కక్కించి మరీ యమదొంగలో స్లిమ్ చేయించాడు రాజమౌళి. అది మొదలు ఇప్పటి వరకు మళ్లీ లావెక్కలేదు ఎన్టీఆర్. మధ్యమధ్యలో ఊసరవెల్లి, జనతా గ్యారేజ్ లో కాస్త ఒళ్లు చేసినట్లు కనిపించినా.. పాత రూపంలోకి అయితే మారలేదు. మళ్లీ జై లవకుశ టైమ్ కు అంతా సెట్ అయిపోయింది. మొన్న విడుదలైన అరవింద సమేతలో అయితే మరీ సన్నగా మారిపోయాడు జూనియర్. మెరపు తీగలా కనిపించాడు. అయితే ఇప్పుడు మాత్రం మళ్లీ బరువు పెరుగుతున్నాడు ఈ హీరో. ఇప్పుడు రాజమౌళి సినిమా కోసం భారీగా బరువు పెరిగి పోతున్నాడు ఈ కుర్ర హీరో.
ఇప్పుడు విడుదలైన స్టిల్స్ లో ఎన్టీఆర్ ను చూసిన వాళ్లంతా షాకయ్యారు. ఏంటిది.. ఇంతగా లావయ్యాడేంటి అంటూ గుసగుసలాడుకున్నారు. ఇది ఎన్టీఆర్ చెవిన పడిందో లేదో తెలియదు గానీ.. కావాలనే రాజమౌళి కోసం బరువు పెరిగిపోయాడు. ఇప్పుడు మళ్లీ కెమెరాకు నిండుగా తయారయ్యాడు జూనియర్. మరీ రాఖీ కాదు గానీ సాంబ టైమ్ లో ఎలా ఉండేవాడో అలా ఉన్నాడు ఇప్పుడు ఎన్టీఆర్. దానికి తోడు గడ్డం కూడా ఉండటంతో మరింత లావుగా కనిపిస్తున్నాడు యంగ్ టైగర్. మొత్తానికి ఒకప్పుడు యమదొంగ కోసం లావుగా ఉన్న ఎన్టీఆర్ ను సన్నబడేలా చేసిన రాజమౌళి.. ఇప్పుడు మళ్లీ సన్నబడిన ఎన్టీఆర్ ను బరువు పెంచుతున్నాడు. ఆర్ఆర్ఆర్ షూటింగ్ ఇప్పుడు హైదరాబాద్ లోనే జరుగుతుంది. త్వరలోనే ఈ చిత్ర తొలి షెడ్యూల్ పూర్తి కానుంది. చరణ్ కూడా ఇందులో ఉన్నాడు.