English   

బెల్లంకొండ సినిమాకు కాజ‌లే అందాల క‌వ‌చం..

Kajal
2018-12-03 06:10:06

అవును.. ఇప్పుడు ఇదే అనిపిస్తుంది మ‌రి. ఎన్ని సినిమాలు చేసినా కూడా ఒక్క‌టి కూడా క‌రుణించ‌క‌పోవ‌డంతో బెల్లంకొండ‌కు పాపం ఇప్పుడు ఏం చేయాలో కూడా అర్థం కావ‌డం లేదు. న‌టించిన ప్ర‌తీ సినిమా రావ‌డం పోవ‌డం జ‌రుగుతున్నాయి కానీ నిల‌బ‌డ‌టం లేదు. ప్ర‌స్తుతం ఈయ‌న రెండు సినిమాల‌తో బిజీగా ఉన్నాడు. ఇందులో క‌వ‌చం ముందుగా వ‌స్తుంది. ఈ చిత్రం డిసెంబ‌ర్ 7న విడుద‌ల కానుంది. ఈ చిత్రంలో బెల్లంకొండ స‌ర‌స‌న‌ కాజ‌ల్, మెహ్రీన్ న‌టిస్తున్నారు. శ్రీ‌నివాస్  మామిళ్ల ద‌ర్శ‌కుడు. ఇందులో పోలీస్ ఆఫీస‌ర్ గా న‌టిస్తున్నాడు బెల్లంకొండ‌. ఇప్పుడు కాజ‌ల్ తో ఓ పాట విడుద‌లైంది. ఇందులో ఇద్ద‌రి కెమిస్ట్రీ చూసి అబ్బో అనుకుంటున్నారు అంతా. అస‌లు ఏజ్ లో త‌న‌కంటే చాలా పెద్ద‌దైన కాజ‌ల్ తో చాలా ఈజీగా అల్లుకుపోయాడు బెల్లంకొండ‌. మ‌రోవైపు కాజ‌ల్ కూడా మ‌ల్లెతీగ‌లా బెల్లంకొండ వార‌సున్ని అల్లుకుపోయింది. 

ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్ కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. కోటి డిజిట‌ల్ వ్యూస్ అందుకుని సినిమాపై ఆస‌క్తి.. అంచ‌నాలు పెంచేసింది ఈ టీజ‌ర్. అయితే రొటీన్ సినిమాగా ముద్ర కూడా వేసుకుంది క‌వ‌చం. డిసెంబ‌ర్ 4న ఈ చిత్ర ఆడియో వేడుక భీమ‌వ‌రంలో భారీగా జ‌ర‌గ‌నుంది. ఈ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ తో శ్రీ‌నివాస్ మామిళ్ళ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నాడు. హ‌ర్షవ‌ర్ధ‌న్ రానే, బాలీవుడ్ న‌టుడు నీల్ నితిన్ ముఖేష్ ఈ చిత్రంలో కీల‌క‌పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఇప్ప‌టికే క‌వ‌చం షూటింగ్ పూర్తైంది.. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు వేగంగా జ‌రుగుతున్నాయి. ఎస్ఎస్ థ‌మ‌న్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండ‌గా.. ఛోటా కే నాయుడు సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. డిసెంబ‌ర్ 7 విడుద‌ల అంటే ఆ రోజు ఎన్నిక‌ల రోజు.. మ‌రి పోలింగ్ డే రోజు సినిమాలు వ‌చ్చినా ప్రేక్ష‌కులు అటు వైపు చూస్తారా అనేది ఆస‌క్తిక‌ర‌మే. మ‌రి చూడాలి.. క‌వ‌చం అయినా బెల్లంకొండ కెరీర్ కు క‌వచంగా మారుతుందో లేదో..? 

More Related Stories