English   

పోలింగ్ డే.. ఇంట్రెస్టింగ్ బాక్సాఫీస్ వార్..

Election-Day
2018-12-05 11:52:30

ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎల‌క్ష‌న్ ఫీవ‌ర్ బాగా న‌డుస్తుంది. ఎన్నిక‌లు తెలంగాణలో అయినా కూడా ఎవ‌రు గెలుస్తారో అనే టెన్ష‌న్ అక్క‌డ కూడా క‌నిపిస్తుంది. ఇలాంటి టైమ్ లో సినిమాలు ఎన్ని వ‌చ్చినా కూడా ప్రేక్ష‌కులు పెద్ద‌గా ప‌ట్టించుకునే మూడ్ లో కూడా లేరు. అందుకే పెద్ద సినిమాలేవీ ఈ టైమ్ లో రావ‌డం లేదు. దొరికిందే బంగారు ఛాన్స్ అనుకుని ఇప్పుడు చిన్న సినిమాల‌న్నీ ఒకేసారి వ‌స్తున్నాయి. 

ముఖ్యంగా తెలంగాణ ఎన్నిక‌ల పోలింగ్ డే డిసెంబ‌ర్ 7 స‌మ‌రం జ‌ర‌గ‌నుంది. ఆ రోజు మూడు సినిమాలు విడుద‌ల కానున్నాయి. చిన్న సినిమాలు కానీ చిన్న సినిమాలు అవి. ఎందుకంటే అందులో అంతా తెలిసిన వాళ్లే ఉన్నారు కాబ‌ట్టి. ముందుగా అంద‌రి చూపులు బెల్లంకొండ శ్రీనివాస్ క‌వ‌చం సినిమాపై ఉన్నాయి. ఈయ‌న‌కు ఇప్ప‌టి వ‌ర‌కు హిట్ లేక‌పోయినా కుర్రాడు భారీ సినిమాల‌తోనే వ‌స్తుంటాడు. ఇప్పుడు కూడా ఇదే చేసాడు. క‌వ‌చంను కొత్త ద‌ర్శ‌కుడు శ్రీ‌నివాస్ మామిళ్ళ తెర‌కెక్కించాడు.ఇందులో పోలీస్ ఆఫీస‌ర్ గా న‌టించాడు బెల్లంకొండ‌. ఇప్ప‌టికే సెన్సార్ టాక్ బ‌ట్టి చూస్తుంటే సినిమా మ‌రోసారి రొటీన్ ఎంట‌ర్ టైన‌ర్ అని తెలుస్తుంది. ఈ చిత్రంలో కాజ‌ల్, మెహ్రీన్ హీరోయిన్లు. 

ఇక ఇదే సినిమాతో పోటీగా వ‌స్తున్న మ‌రో సినిమా నెక్ట్స్ ఏంటి..? త‌మ‌న్నా హీరోయిన్ గా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని కునాల్ కోహ్లీ తెర‌కెక్కించాడు. ల‌వ్, సెక్స్ మ‌ధ్య ఉండే స‌న్న‌టి గీత‌ను చూపిస్తూ ఈ చిత్రం చేసాడు కునాల్. సందీప్ కిష‌న్ హీరోగా న‌టించిన ఈ చిత్రంలో త‌మ‌న్నా ఫుల్ గ్లామ‌ర్ షో చేసింది. ఇదే సినిమాకు బ‌లం కూడా. అయితే అంచ‌నాలు మాత్రం లేవు. ఎంత‌వ‌ర‌కు వ‌సూళ్లు తీసుకొస్తుంద‌నేది కూడా అనుమాన‌మే. ఇక సుమంత్ సుబ్ర‌హ్మ‌ణ్య‌పురం చాలా త‌క్కువ అంచ‌నాల‌తో వ‌స్తుంది. చూడ్డానికి కార్తికేయ సినిమాకు సీక్వెల్ గా అనిపించినా తీసిపారేసేంత సినిమా మాత్రం కాదు. సంతోష్ జాగ‌ర్ల‌మూడి ఈ సినిమాతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నాడు. మ‌రి ఎన్నిక‌ల పోలింగ్ డే రోజు వ‌స్తున్న ఈ చిత్రాల్లో ఏది ప్రేక్ష‌కుల మ‌న‌సులు గెలుస్తుందో.. దేనికి బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఓట్లు ప‌డ‌తాయో చూడాలిక‌.  

More Related Stories