English   

ముద్ర ఎందుకు ముందుకు క‌ద‌ల‌డం లేదు..? 

Nikhil-Mudra
2018-12-05 13:03:32

నిఖిల్, లావ‌ణ్య త్రిపాఠి జంట‌గా న‌టిస్తున్న యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ ముద్ర‌. ఈ చిత్ర విడుద‌ల తేదీ క‌న్ఫ‌ర్మ్ అయి కూడా చాలా రోజులైంది. కానీ అనుకున్న టైమ్ కు వ‌స్తుందా రాదా అనే కంగారు మాత్రం క‌నిపిస్తుంది ద‌ర్శ‌క నిర్మాత‌ల్లో. ఎందుకో తెలియ‌దు కానీ ఈ చిత్రం ప‌ట్టాలెక్కిన రోజు నుంచి కూడా ముద్ర‌కు ఏదో ఒక ఇబ్బంది వ‌స్తూనే ఉంది. ఇప్పుడు కూడా విడుద‌ల తేదీ ద‌గ్గ‌ర ప‌డుతున్నా కూడా ప్ర‌మోష‌న్స్ మాత్రం జ‌ర‌గడం లేదు. ఇంకా చెప్పాలంటే నిఖిల్ ఈ చిత్రాన్ని స‌రిగ్గా ప్ర‌మోట్ చేయ‌ట్లేద‌నే వార్త‌లు కూడా వినిపిస్తున్నాయి. ఆయ‌న ఆటిట్యూడ్ కార‌ణంగానే ఇప్పుడు ముద్ర‌కు లేని పోని తిప్ప‌లు వ‌స్తున్నాయి. పైగా అనుకున్న టైమ్ కు షెడ్యూల్స్ పూర్తి కాక‌పోవ‌డం.. టైమ్ కు షూటింగ్ కాక‌పోవ‌డంతో ముద్ర‌పై నెగిటివ్ ఫీడ్ బ్యాక్ వెళ్తుంది. ఈ చిత్రాన్ని డిసెంబ‌ర్ 29న విడుద‌ల చేయాల‌ని చూస్తున్నారు. వాస్త‌విక సంఘ‌ట‌న‌ల ఆధారంగా జ‌ర్న‌లిజం నేప‌థ్యంలో తెర‌కెక్కుతోన్న సినిమా ఇది. స‌మాజంలో జ‌రుగుతున్న కొన్ని విష‌యాల‌ను ఎలా మీడియా ప‌రిష్క‌రిస్తుంది.. అందులో మీడియా బాధ్య‌త‌ను గుర్తు చేస్తూ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు ద‌ర్శ‌కుడు టిఎన్ సంతోష్. ముద్ర సినిమా షూటింగ్ చివ‌రిద‌శ‌లో ఉంది.. అదే స‌మ‌యంలో డ‌బ్బింగ్ ప‌నులు కూడా పూర్తి చేస్తున్నారు యూనిట్.

తొలిసారి ఇందులో నిఖిల్ జ‌ర్న‌లిస్ట్ పాత్ర‌లో న‌టిస్తున్నాడు. వ‌ర‌స ఫ్లాపుల‌తో ఇబ్బంది ప‌డుతున్న నిఖిల్ కెరీర్ కు ముద్ర కీల‌కంగా మారింది. ఒక‌ప్పుడు వ‌ర‌స విజ‌యాలు అందుకున్న ఈ కుర్ర హీరో.. కిరాక్ పార్టీతో జోరు త‌గ్గించాడు. దానికి ముందు వ‌చ్చిన కేశ‌వ కూడా యావ‌రేజ్ గానే నిలిచింది. దాంతో ముద్ర కీల‌కంగా మారింది. ఇందులో జ‌ర్న‌లిస్ట్ అర్జున్ సుర‌వ‌రంగా న‌టిస్తున్నారు నిఖిల్. లావ‌ణ్య త్రిపాఠి తొలిసారి నిఖిల్ తో జోడీక‌ట్టింది. ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, పోసాని కృష్ణ‌ముర‌ళి, నాగినీడు, ప్ర‌గ‌తి, స‌త్య‌, త‌రుణ్ అరోరా మ‌రియు రాజా ర‌వీంద్ర ఇత‌ర ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. స్యామ్ సిఎస్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఔరా సినిమాస్ పివిటి మ‌రియు మూవీ డైన‌మిక్స్ ఎల్ఎల్‌పి సంస్థ‌ల‌పై కావ్య‌ వేణుగోపాల్, రాజ్ కుమార్ ముద్ర సినిమాను నిర్మిస్తున్నారు. ఠాగూర్ మ‌ధు ఈ చిత్రానికి స‌మ‌ర్ప‌కుడిగా ఉన్నారు. మొత్తానికి క‌ర్ణుడి చావుకు ల‌క్ష కార‌ణాల‌న్న‌ట్లు ముద్ర రాక‌పోవ‌డానికి చాలా కార‌ణాలున్నాయి. మ‌రి అవ‌న్నీ ఎప్ప‌టికీ తీర‌తాయో చూడాలిక‌. 

More Related Stories