English   

విశాల్ కు మద్రాస్ హైకోర్టు బాసట !

Vishal
2018-12-22 08:33:54

తమిళ నిర్మాతల మండలిలో రెండు వర్గాల మధ్య జరుగుతున్న వివాదంలో మండలి అధ్యక్షుడు విశాల్‌కు మద్రాస్ హైకోర్టులో ఊరట లభించింది. టి.నగర్‌లోని నిర్మాతల మండలి కార్యాలయానికి అసమ్మతి వర్గం సభ్యులు వేసిన తాళాన్ని, రెవెన్యూ అధికారులు వేసిన తాళాన్ని తీసివేయాలంటూ ఆదేశాలు ఇచ్చింది. నిర్మాతల మండలిలో రూ.7కోట్ల మేర అక్రమాలు జరిగాయంటూ విశాల్ వ్యతిరేక వర్గం రెండ్రోజుల క్రితం ఆరోపణలు చేసి నిర్మాతల మండలి కార్యాలయం వద్ద ధర్నా చేశారు. ఆ తర్వాత ఆఫీసుకు తాళం వేశారు. 

ఈ సంఘటనపై విశాల్‌ వర్గానికి చెందిన దర్శక నిర్మాత ప్రవీణ్‌కాంత్‌ పాండి బజార్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గురువారం విశాల్ తన మద్దతుదారులతో కలిసి వెళ్లి కార్యాలయం తాళం బద్దలుకొట్టేందుకు ప్రయత్నించగా పోలీసులు ఆయన్ని అడ్డుకుని అరెస్ట్ చేశారు. అదే సమయంలో నిర్మాతల మధ్య నెలకొన్న తగాదాలను ప్రస్తావిస్తూ ఆఫీసుకు సీలు వేయడంపై విశాల్ హైకోర్టును ఆశ్రయించారు. 

దీనిపై విచారణ జరిపిన న్యాయమూర్తులు నిర్మాత మండలి కార్యాలయానికి వేసిన తాళం, సీల్‌ను తొలగించాలంటూ ఆదేశాలు జారీచేశారు. ఈ వివాదంలో పోలీసులు ప్రవర్తించిన తీరుపై మద్రాస్ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అసమ్మతి వర్గం నిర్మాతల వేసిన తాళాన్ని తీసేందుకు ప్రయత్నించి విశాల్‌ను ఎందుకు అరెస్ట్ చేశారంటూ నిలదీసింది. ఎన్ని వివాదాలున్నా మండలి అధ్యక్షుడి హోదాలో లోనికి వెళ్లే అధికారం విశాల్‌కు ఉంటాయని ఆయన్ని అడ్డుకోవడం సమంజసం కాదని కోర్టు పేర్కొంది.  దీంతో విశాల్ పెద్ద ఊరట లభించిందనే చెప్పాలి.

More Related Stories