English   

క్రిస్మస్ రోజునే  తాతయ్య అయిన మెగాస్టార్

Chiranjeevi
2018-12-25 11:27:08

పవిత్రమైన క్రిస్మస్ పండుగ రోజున మెగాస్టార్ చిరంజీవి తాతయ్య అయ్యారు. ఆయన రెండో కుమార్తె శ్రీజ, కళ్యాణ్ దేవ్ దంపతులకు మంగళవారం పండంటి ఆడబిడ్డ జన్మించింది. ఈ విషయాన్ని కళ్యాణ్ దేవ్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా స్పష్టం చేశారు. మంగళవారం ఉదయం తన భార్య శ్రీజ ఆడ బిడ్డకు జన్మనిచ్చినట్లు తెలిపారు. 2018 క్రిస్మస్ తన జీవితాంతం గుర్తుండి పోతుందని, ఈరోజు ఉదయం తమకు అమ్మాయి జన్మించిందని, మీ అందరికీ సూపర్ మెర్రీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని కల్యాణ్ దేవ్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ పోస్ట్ తో పాటు పాప పాద ముద్ర ఉన్న ఫొటోను కూడా పోస్ట్ చేశారు. కాగా, ‘మెగా’ కుటుంబంలోకి కొత్త వ్యక్తి వచ్చిన విషయాన్ని తెలుసుకున్న అభిమానులు విషెస్ తెలుపుతున్నారు.

శ్రీజకు ఇప్పటికే ఒక పాప ఉంది. ఆమె పేరు నివృతి. అందుకే ఇన్‌స్టాగ్రామ్ పోస్టులో సైతం #SreejaKalyanBaby2Arrived అని కళ్యాణ్ దేవ్ పేర్కొన్నారు. కాగా, శ్రీజ వివాహం కళ్యాణ్ దేవ్‌తో 2016 మార్చి 28న బెంగళూరులో జరిగింది. ఈ పెళ్లి వేడుకకు పలువురు సినీ ప్రముఖులు, కుటంబ సభ్యులు, సన్నిహితులు హాజరయ్యారు. ఆ త‌ర్వాత హైదరాబాద్‌లోని పార్క్ హయత్ హోటల్‌లో శ్రీజ, కళ్యాణ్‌ల రిసెప్షన్ జరిగింది. ఇదిలా ఉంటే, చిన్నల్లుడంటే చిరంజీవికి ఎనలేని అభిమానం. అందుకే ఆయన సినిమాల్లో నటించాలని ఉందని చెప్పగానే చిరంజీవి పచ్చజెండా ఊపారు. విశాఖపట్నంలో సత్యానంద్ వద్ద ప్రత్యేకంగా నటనలో శిక్షణ ఇప్పించారు. ‘విజేత’ సినిమాతో ఆరంగేట్రం చేయించారు. ఇప్పుడు కళ్యాణ్ తన రెండో సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. క్రిస్మస్ రోజున శ్రీజకు ఆడబిడ్డ జన్మించడం అటు మెగా ఫ్యామిలీతో పాటు ఇటు అభిమానుల్లోనూ ఆనందం నింపింది.  

More Related Stories