English   

ఇంత‌కీ శ‌ర్వానంద్ మీడియాను తిట్టాడా.. పొగిడాడా..? 

Sharwanand
2018-12-26 04:45:20

ఏమో ఇప్పుడు ఈయ‌న మాట‌లు చూస్తుంటే ఇదే అనుమానం వ‌స్తుంది. మీడియా ఇంత బలంగా ఉన్న ఈ రోజుల్లో.. ఏ విషయాన్ని అంత ఈజీగా దాచలేము. అది మన హీరోలకు కూడా బాగా తెలుసు. అందుకే మీడియా ముందు చాలా తెలివిగా మాట్లాడుతున్నారు. మొన్న వరుణ్ తేజ్.. ఇప్పుడు శర్వానంద్ చేసింది అదే. తాజాగా పడిపడి లేచే మనసు సక్సెస్ మీట్ కు వచ్చిన శర్వానంద్ చాలా తెలివిగా మాట్లాడాడు. ముఖ్యంగా క్రిటిక్స్ ని టార్గెట్ చేశాడు ఈ హీరో. తన సినిమా బయట ప్రేక్షకులకు నచ్చిందని.. కానీ విశ్లేషకులకు మాత్రం అంతగా నచ్చలేదు అని చెప్పాడు శర్వానంద్. అయినా కూడా తనకు బాధ లేదని.. మీకు అనిపించింది అనిపించినట్టు రాసినందుకు థాంక్స్ అని చెప్పాడు. తన సినిమాలు బాగున్నప్పుడు బాగున్నాయి అని రాసిన‌పుడు.. న‌చ్చ‌న‌పుడు నచ్చలేదని రాయ‌డంలో త‌ప్పు లేద‌ని చెప్పాడు ఈ హీరో.

కాకపోతే ఈ సినిమా ఒప్పుకున్న రోజు నుంచి కూడా ఇది చాలా పెద్ద విజయం సాధిస్తుందని నమ్మానని.. కానీ ఇప్పుడు వస్తున్న ఫలితాలు చూసి కాస్త నిరాశ ప‌డిన మాట మాత్రం వాస్తవం అని ఒప్పుకున్నాడు శర్వా. పడిపడి లేచే మనసు సినిమా ఫలితంతో సంబంధం లేకుండా తనకు బాగా ఇష్టమైన సినిమా అని.. తన కెరీర్లో పాటల పరంగా ఈ సినిమా ఎప్పుడూ అగ్రస్థానంలోనే ఉంటుందని చెప్పాడు శర్వానంద్. ఇప్పుడు మీకు నచ్చే సినిమా చేయలేక పోయినా తర్వాత సినిమా కచ్చితంగా నచ్చేలా ఉంటుందని ధీమాగా చెబుతున్నాడు ఈ హీరో. ప్రస్తుతం ఈయ‌న సుధీర్ వర్మ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఇందులో కళ్యాణి ప్రియదర్శన్, కాజల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. వచ్చే ఏడాది మార్చిలో విడుదల కానుంది ఈ చిత్రం. ప‌డిప‌డి మనసుతో ఫ్లాప్ ఇచ్చిన శర్వానంద్.. సుధీర్ వర్మ సినిమాతో ఏం చేస్తాడో చూడాలి.

More Related Stories