English   

అర‌వ నేల‌పై ఆస‌క్తిక‌రంగా మారిన పొంగ‌ల్ వార్..

tamil movies released in pongal 2019
2018-12-26 12:20:26

ఒకే రోజు రెండు పెద్ద సినిమాలు వస్తే కలెక్షన్లపై కచ్చితంగా ప్రభావం పడుతుంది. ఈ విషయం తెలిసి కూడా ఇప్పటికే చాలా మంది హీరోలు అలా చేసి నష్టపోయారు. దీనికి తాజా నిదర్శనం పడిపడి లేచే మనసు, అంతరిక్షం సినిమాలే. ఈ రెండు సినిమాలు ఒకే రోజు కానీ రాకపోయి ఉంటే కచ్చితంగా ఓపెనింగ్స్ భారీగా వచ్చి ఉండేవ‌ని అంచనా వేస్తున్నారు విశ్లేషకులు. ఇప్పుడు తమిళనాట కూడా ఇదే జరగబోతుంది. అక్కడ పొంగల్ వార్ ఆసక్తికరంగా మారింది. అజిత్, రజనీకాంత్ సినిమాలు ఒకేసారి వస్తున్నాయి. దాంతో బయ్యర్లు భయపడుతున్నారు. ఈ రెండు సినిమాలపై అంచనాలు భారీగా ఉండటం వల్ల ఒకే రోజు వస్తే ఖచ్చితంగా ఆ ప్రభావం రెండు సినిమాలపై ఉంటుందని.. చివరికి దాని వల్ల నష్టపోయేది బయ్యర్లే అని చెబుతున్నారు విశ్లేషకులు.
పైగా అటు అజిత్.. ఇటు రజనీకాంత్ ఇద్దరూ ఈ మధ్య కాలంలో పెద్దగా విజయాలు ఇచ్చింది లేదు. రజనీకాంత్ 2.0 కూడా అంచనాలు అందుకోలేదు. ఆ సినిమా చేసిన బిజినెస్ కు.. ఇప్పుడు వ‌చ్చిన‌ కలెక్షన్లకు అసలు పొంతనే లేదు. 800 కోట్లు వచ్చాయని గొప్పలు చెప్పుకుంటున్నా కూడా బయ్య‌ర్లు మాత్రం నష్టాలపాలైపోయారు. అందుకే ఇప్పుడు సంక్రాంతికి వస్తున్న పేట సినిమా బిజినెస్ చాలా త‌క్కువ‌గా జ‌రుగుతుంది. కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కించిన ఈ సినిమాపై ముందు పెద్ద‌గా అంచనాలు లేవు కానీ టీజ‌ర్, పాట‌లు విడుద‌లైన త‌ర్వాత పెరిగాయి.
ఈ సినిమాతో పోటీ ప‌డుతున్న విశ్వాసం బిజినెస్ కూడా 100 కోట్ల పైగానే జరిగింది. అలాంటిది ఈ ఇద్దరు ఒకే పండక్కి వస్తే ఖచ్చితంగా ఆ ప్రభావం రెండు సినిమాలపై పడుతుంది. గ‌తంలో పొంగ‌ల్ కు ఒకేసారి రెండు సినిమాలు రావడం.. విజయం సాధించడం జరిగింది. ఇప్పుడు కూడా ఇదే జరుగుతుందని ఆశిస్తున్నారు నిర్మాతలు. కానీ ఒకవేళ ఏదైనా ఒక సినిమాకు నెగిటివ్ టాక్ వస్తే రెండో సినిమా పరిస్థితి ఏంటని భయపడుతున్నారు బయ్యర్లు. రజినీకాంత్, అజిత్ మధ్య తాను కూడా ఉన్నాను అంటూ శింబు కూడా ఇదే పండక్కి వస్తున్నాడు. ఈయన అత్తారింటికి దారేది రీమేక్ సినిమాతో వస్తున్నాడు. మరి త్రిముఖ పోరులో పొంగల్ 2019 విన్నర్ ఎవరో చూడాలిక.

More Related Stories