English   

ర‌జినీకాంత్ పేట తెలుగు రైట్స్ మ‌రీ అంత ఛీపా..?

Rajinikanth's Petta.movie telugu rights
2018-12-26 12:28:11

కాలం కలిసి రాకపోతే తాడే పామై కరుస్తుంది అంటారు. ఇప్పుడు రజినీకాంత్ విషయంలో కూడా ఇదే జరుగుతుందేమో..? ఒకప్పుడు ఈయ‌న‌ సినిమాల కోసం పోటీపడే బయ్యర్లు.. ఇప్పుడు నో నో అంటున్నారు. దానికి కారణం ఈ మధ్య ర‌జినీ చేసిన సినిమాలు.. అవి తెచ్చిన‌ ఫలితాలు. గత నాలుగేళ్లుగా తెలుగులో రజనీకాంత్ టైం అసలు బాలేదు. కొచ్చాడయన్ నుంచి వరుస ఫ్లాపులు ఇస్తున్నాడు రజనీకాంత్. లింగ, కబాలి, కాలా సినిమాలు తెలుగులో డిజాస్టర్లుగా నిలిచాయి. ఇక మొన్న విడుదలైన 2.0 కూడా దీనికి మినహాయింపు కాదు. ఎందుకంటే ఈ సినిమాలు తెలుగు రాష్ట్రాల్లోనే 72 కోట్లకు అమ్మారు. కానీ 50 కోట్లకు మించి వసూలు చేయలేదు. అందులో నైజాంలోనే 24 కోట్లు వచ్చాయి. ఆంధ్రలో డిస్టిబ్యూటర్లు దారుణంగా న‌ష్టపోయారు 2.0 సినిమాను న‌మ్ముకుని. ఈ మధ్య కాలంలో వరసగా రజినీకాంత్ నమ్మి మునిగిపోవడం బ‌య్య‌ర్ల‌కు అలవాటుగా మారిపోయింది. అందుకే ఈసారి పేట విషయంలో అది జరగకుండా ముందు నుంచి జాగ్రత్త పడుతున్నారు.
ఈ సినిమాకు అడిగినంత ఇవ్వడానికి తాము సిద్ధంగా లేమని ఓపెన్ గానే చెప్పేశారు డిస్ట్రిబ్యూటర్లు. అందుకే గత కొన్నేళ్లుగా ఎప్పుడూ లేనంత దారుణమైన రేట్లకు పేట రైట్స్ పడిపోయాయి. ఈ సినిమా తెలుగు హక్కులను కేవలం 13 కోట్లకు మాత్రమే ఇచ్చార‌నే వార్తలు ఇప్పుడు సంచ‌ల‌నం సృష్టిస్తున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే రజనీకాంత్ కూడా అందరి లాంటి హీరో అయిపోయినట్టే. ఈ సినిమా సంక్రాంతికి విడుదల కానుంది. మన దగ్గర రామ్ చరణ్, బాలయ్య, వెంకటేష్ లాంటి హీరోలు సంక్రాంతి బరిలో ఉన్నారు. వీళ్ళందర్నీ కాదని పేట కోసం భారీ రేట్లు పెట్టే సాహసం మన డిస్ట్రిబ్యూటర్లు చేయట్లేదు. అందుకే పేట కోరుకున్న రేట్ రావట్లేదు. కార్తీక్ సుబ్బరాజ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. త్రిష, సిమ్రాన్ లు హీరోయిన్ లుగా న‌టించారు. మరి ఇంత తక్కువ రేట్ లో వస్తున్న రజనీకాంత్.. బాక్సాఫీస్ దగ్గర ఎలా మాయ చేస్తాడో చూడాలి.

 

More Related Stories