English   

థాకరే ట్రైలర్ టాక్ : వివాదాలు ఖాయమే !!

Nawazuddin-Siddiqui
2018-12-27 11:56:19

ఇప్పుడు బయోపిక్ ల సీజన్ నడుస్తున్నాటు ఉంది. అన్ని బాషలలో వరసగా బయోపిక్ లు తెరకెక్కుతున్నాయి.  క్రీడాకారుల జీవిత చరిత్రల ఆధారంగా ఎక్కువ సినిమాలు తెరకెక్కిస్తున్నారు. ఇప్పుడు మరాఠా ప్రజల కోసం, మరాఠా ప్రజల అభిమానాన్ని చొరగొన్న నేత, శివసేన పార్టీ స్థాపకుడు బాల్ థాకరే జీవిత చరిత్ర ఆధారంగా సినిమాను తెరకెక్కిస్తున్నారు. బాల్ థాకరే పేరు వింటే ఎంతటి జాతీయ పార్టీకైనా సరే చెమటలు పట్టాల్సిందే. ఆ పేరు ప్రస్తావిస్తే చాలు బాల్ థాకరే శత్రువులు పులి గాండ్రింపు విన్నంతగా హడలిపోతారు. ధైర్యం, ముక్కు సూటితనానికి మారుపేరైన ‘థాకరే’ జీవితంపై ఇప్పుడు ఓ సినిమా సిద్ధమైంది. శివసేన పార్టీ వ్యవస్థాపకుడిగా రాజకీయాలను శాసించిన థాకరే పాత్రలో బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధికి నటించారు. బుధవారం ఈ సినిమా ట్రైలర్ యూట్యూబ్‌లో విడుదలైంది. 

మరాఠా నాయకుడిగా థాకరే ఎదిగిన తీరుతో పాటు థాకరే తీసుకున్న కఠినమైన నిర్ణయాలను కూడా చూపించారు.  థాకరే పాత్రలో నవాజుద్దీన్ ఒదిగిపోయి నటించారు. చాలా సన్నివేశాల్లో థాకరేను తలపించాడు నవాజుద్దీన్.  మహారాష్ట్ర అల్లర్లతో మొదలయ్యే ఈ ట్రైలర్‌లో ‘‘నాకు బొంబాయి నగరంలో శాంతి కావాలి’’ అనే వాయిస్ వినిపిస్తుంది. ‘‘ఈ సమయంలో ఒకే వ్యక్తి బొంబాయిని ప్రశాంతంగా ఉంచగలుగుతారు’’ అనే వాయిస్ ఓవర్‌తో పులిగాండ్రిపుతో బాల్ థాకరే పాత్రను పరిచయం చేశారు. అయితే బాబ్రీ విషయాన్ని ఇందులో టచ్ చేయడం ఇప్పుడు వివాదంగా మారింది. కోర్టులో రామ మందిరం గురించి జరిగే వాదనలో ఓ లాయర్ ‘‘రాముడు అక్కడే పుట్టాడని మీకెలా తెలుసు?’’ అని ప్రశ్నిస్తాడు. ‘‘లేకపోతే పాకిస్తాన్‌లో పుట్టాడా?’’ అని థాకరే అతడిని తిరిగి ప్రశ్నించడం హైలైట్. 

మరో సన్నివేశంలో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ.. ‘‘మీరెప్పుడు మహారాష్ట్ర కేవలం మరాఠీలదేనని అంటుంటారు’’ అని థాకరేని ప్రశ్నిస్తారు. ‘‘నేను ఎప్పుడు జై హింద్, జై మహారాష్ట్ర అంటాను. అంటే నాకు ముందు దేశం ముఖ్యం. ఆ తర్వాతే రాష్ట్రం’’ అని థాకరే సమాధానం ఇస్తారు. ఇంకా ఇలాంటి ఆసక్తికర డైలాగులెన్నో ఈ ట్రైలర్‌లో చూడొచ్చు. ఈ సినిమాలో మూడు వివాదాస్పద సన్నివేశాలను తొలగించాలని సెన్సార్‌ బోర్డు చిత్రయూనిట్‌ను ఆదేశించింది. బాబ్రీ మసీదు సన్నివేశాలు, దక్షిణాది ప్రజలపై వ్యాఖ్యలను తొలగించాలంటూ సెన్సార్ బోర్డు సూచించింది. అయితే ఈ సినిమా నిర్మాత, శివసేన ఎంపీ సంజయ్ రౌత్, థాకరే కుమారు ఉద్దవ్‌లు వాటిని తొలగించకుండానే ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సినిమాని ఎవరూ ఆపలేరని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. అభిజీత్‌ పాన్సే దర్శకత్వం వహించిన ఈ సినిమా జనవరి 25న హిందీ, మరాఠీ భాషల్లో విడుదల కానుంది.    మరి ఈ సినిమా రిలీజ్ తరువాత ఎన్ని వివాదాలు చెలరేగుతాయో చూడాలి. 

More Related Stories