English   

బ్ల‌ఫ్ మాస్ట‌ర్’ మూవీ రివ్యూ 

Bluff-Master
2018-12-28 08:20:51

‘మిస్టర్ పర్ఫెక్ట్’ సినిమాతో వెండితెరకు పరిచయమయ్యాడు నటుడు సత్యదేవ్. అదేమీ అంత గుర్తింపు తెక్పోయినా పోరీ దర్శకత్వంలో వచ్చిన ‘జ్యోతిలక్ష్మి’ సినిమా సత్యదేవ్‌కు మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. ఇప్పటి వరకు పదికి పైగా సినిమాల్లో ఆయన నటించినా సింగిల్ హీరోగా ‘బ్లఫ్ మాస్టర్’ అనే సినిమాతో శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ‘రోమియో’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన గోపీ గణేశ్ తమిళ సినిమా ‘శతురంగవేట్టైని’కి ఈ చిత్రాన్ని రీమేక్ గా తెరకెక్కించారు. నందితా శ్వేత హీరోయిన్‌గా నటించింది. మొదటి నుండి సినిమా మీద పెద్దగా అంచనాలు లేకపోయినా ట్రైలర్ టీజర్ లు కాస్త ఆసక్తి రేపాయి. మరి ఈ సినిమా ప్రేక్షకులని ఏమేరకు అలరించిందో చూద్దాం.

కధ : 

ఉత్తమ్ (సత్యదేవ్) రాటుదేలిన మోసగాడు. రకరకాల వ్యాపారాలు ప్రారంభించి, ప్రజలను మోసం చేసి డబ్బు సంపాదిస్తుంటాడు. వైజాగ్‌లో ఉత్త‌మ్‌కి అవ‌ని(నందితా శ్వేత‌) ప‌రిచ‌యం అవుతుంది. ఉత్త‌మ్ మంచివాడు అనుకుని అవ‌ని అత‌న్ని ప్రేమిస్తుంది కూడా. అయితే త‌ను ప్ర‌జ‌ల‌ను మోసం చేసి డ‌బ్బులు సంపాదిస్తున్నాన‌నే నిజం ఆమెకు చెప్పిన ఉత్త‌మ్ వైజాగ్ నుండి వెళ్లిపోతాడు. డబ్బే అతనికి సమస్యలు తెచ్చిపెడుతుంది. ఈ బతుకెందుకురా అనేలా చేస్తుంది. అయితే, అవనిని ప్రేమించడం మొదలుపెట్టాక ఉత్తమ్ మారతాడు. అవ‌నిని పెళ్లి చేసుకుని చిక్ మంగ‌ళూర్ వెళ్లిపోతాడు. కానీ, పశుపతి (ఆదిత్య మీనన్) రూపంలో ఉత్తమ్‌కు మరో సమస్య ఎదురవుతుంది. అది కూడా డబ్బు, మోసం‌తో ముడిపడినదే. దాన్ని ఉత్తమ్ ఎలా అధిగమించాడు ? ఆదిత్య మీన‌న్ బారి నుండి ఎలా త‌ప్పించుకున్నాడు? ఎలాంటి గ‌మ్యం చేరుకున్నాడ‌నేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ : 

గాలి, నీరు, నిప్పు, ఆకాశం, నేల లాంటి పంచభూతాలతో డబ్బు అనే ఆరవ భూతం కూడా చేరిపోయింది. డబ్బుంటేనే ఏదైనా అనే నమ్మే చాలా మంది డబ్బు సంపాదించడానికి ఎన్ని అడ్డదారులైనా తొక్కుతారు. ఇదే ప్రధాన కథాంశంగా చేసుకుని, కొన్ని యథార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కించిన సినిమానే ‘బ్లఫ్ మాస్టర్’. ప్రస్తుతం సమాజంలో జరుగుతోన్న మోసాలనే దర్శకుడు సినిమాలో చూపించారు. ప్రజల్ని మోసం చేయడానికి వాళ్లు పన్నుతున్న పన్నాగాలను కళ్లకు కట్టినట్లు చూపించారు. 

ఫస్టాఫ్‌లో ఉత్తమ్ కుమార్ చేసిన మోసాలు, హీరోహీరోయిన్ల మధ్య ప్రేమ, పశుపతి క్రూరత్వాన్ని దర్శకుడు చాలా ఆసక్తికరంగా చూపించారు. ప్రజలను నమ్మించడానికి ఉత్తమ్ వేసే ఎత్తులు ఆకట్టుకుంటాయి. కొన్ని చోట్ల ఈలలు వేయిస్తాయి. అయితే, సెకండాఫ్‌లో కథనం కాస్త నెమ్మదించింది. కానీ, ఓ పేరుమోసిన వ్యాపారిని మోసం చేసే ఎపిసోడ్ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. తమిళ సినిమా రీమేకే అయినా దర్శకుడు గోపీ గణేశ్ తెలుగు నేటివిటికి తగ్గట్టుగా ఉంది. 

సినిమాలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది హీరో సత్యదేవ్ నటన గురించే. ముఖ్యంగా డైలాగ్ డెలివరీ, సెకండాఫ్‌లో స్వామీజీ వేషలో వ్యాపారిని నమ్మించే సన్నివేశంలో సత్యదేవ్ నటన అద్భుతమనే చెప్పాలి. ఇక ఈ సినిమాకి మరో ప్రధాన బలం డైలాగులు. గోపీ గణేశ్, పులగం చిన్నారాయణలు అదిరిపోయే డైలాగులు అందించారు. డబ్బంటే అస్సలు ఆశలేని, మోసం అంటే ఏంటో తెలియని అమ్మాయి పాత్రలో నందితా శ్వేత ఆకట్టుకుంది. కాకపోతే అది కాస్త బెదిసికోట్టేలా అనిపించింది. ఇక బ్రహ్మాజీ, పృథ్వీ, వంశీ తదితరులు తమ పాత్రల పరిధి మేర నటించారు. సునీల్ కశ్యప్ అందించిన పాటలు, నేపథ్య సంగీతం బాగున్నాయి.  

చివరగా :  ‘బ్లఫ్ మాస్టర్’ - ఎంటర్టైన్మెంట్ మాస్టర్  

రేటింగ్ : 2.5 / 5

More Related Stories