English   

కారెక్ట‌ర్స్ మార్చుకున్న చిరంజీవి, ప‌వ‌న్ క‌ళ్యాణ్.. 

Pawan
2018-12-29 14:12:16

సినిమాల్లో అవసరం అనుకున్నప్పుడు క్యారెక్టర్స్ చేంజ్ అవుతుంటారు కదా. ఇప్పుడు నిజజీవితంలో కూడా చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఇదే చేస్తున్నారు. నమ్మడానికి కాస్త విచిత్రంగా అనిపించినా కూడా ఇదే నిజం. కాస్త ఆలోచిస్తే ఇందులో మర్మం కూడా అర్థం అవుతుంది. మొన్నటి వరకు చిరంజీవి రాజకీయాలతో బిజీగా ఉన్నాడు. తొమ్మిదేళ్ల పాటు తనకు అలవాటు లేని రంగంలోనే ఉన్నాడు మెగాస్టార్. అందులో రెండేళ్లు కేంద్రమంత్రిగా.. ఐదేళ్లుగా ఎంపిగానూ ఉన్నాడు చిరంజీవి. తాను సాధించాలి అనుకున్న విజయాలు రాజకీయాల్లో అందుకోలేకపోయాడు ఈ హీరో. అందుకే అది తనకు కలిసి రావట్లేదని మళ్ళీ సినిమాల్లోకి వచ్చాడు అన్నయ్య. వ‌చ్చీ రాగానే ఖైదీ నెంబర్ 150 సినిమాతో సంచలనం సృష్టించాడు. ఇప్పుడు ఇక రాజకీయాలకు పూర్తిగా సెలవు ఇచ్చేశాడు మెగాస్టార్. 

తనకు సినిమాలు చాలు అని రాజకీయాలు వ‌ద్ద‌ని చెప్పకనే చెబుతున్నాడు. ఇదే సమయంలో తమ్ముడు పవన్ కళ్యాణ్ మాత్రం పూర్తిగా రాజకీయాలతోనే కాలం గడిపేస్తున్నాడు. ఇప్పుడు సినిమాలు చేసే మూడ్ లో అసలు లేడు. నిర్మాతలు కోట్ల ఆఫర్ లు ఇస్తున్నా కూడా పవన్ మాత్రం రాజకీయాలు కావాలంటున్నాడు. ఈయన మనసు మార్చుకునేలా కనిపించడం లేదు. జనసేనతోనే తన ప్రయాణం అంటున్నాడు పవర్ స్టార్. వచ్చే ఎన్నికల్లో ఈ పార్టీ చూపించే ప్రభావంతో పవన్ సినిమా భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఒకవేళ అప్పుడు పార్టీ గెలిస్తే మాత్రం పవన్ ను ఇక సినిమా ఇండస్ట్రీలో చూడలేం. మొత్తానికి అప్పుడు అన్నయ్య రాజకీయాల్లో ఉంటే ఇప్పుడు తమ్ముడు రాజకీయాల్లో ఉన్నాడు. అప్పుడు తమ్ముడు సినిమాల్లో బిజీగా ఉంటే ఇప్పుడు అన్నయ్య ఆ బాధ్యత తీసుకున్నాడు.

More Related Stories