English   

ఎంపీగా పోటీ చేయనున్న ప్రకాష్ రాజ్ !

Prakash-Raj
2019-01-01 07:07:46

విలక్షణ నటుడు ప్ర‌కాశ్ రాజ్ రాజ‌కీయాల్లో ప్ర‌వేశించ‌నున్నారు. నూతన సంవత్సరం సందర్భంగా స్వయంగా ప్రకాష్ రాజే ఈ కీలక ప్రకటన చేశారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు ఆయన ట్విట్టర్‌ వేదికగా ప్రకటించారు. ఆయన ట్వీట్ యధాతదంగా ‘అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. నూతన సంవత్సరం మరింత బాద్యత పెంచుతుందని మీ అందరి మద్ధతుతో వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా పోటీచేస్తున్నా, ఎక్కడి నుంచి అనేది త్వరలోనే ప్రకటిస్తా వచ్చేది ప్రజా ప్రభుత్వమే’ అంటూ ట్వీట్ చేశారు. చివర్లో #citizensvoice, #justasking పార్లమెంట్‌లో కూడా అంటూ హ్యాష్ ట్యాగ్‌లు పెట్టారు. జ‌ర్న‌లిస్టు గౌరీ లంకేశ్ హ‌త్య త‌ర్వాత‌ ప్ర‌కాశ్ రాజ్ ప్రస్తుత రాజ‌కీయాల‌ పై వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. కొద్ది రోజులు సోషల్ మీడియా వేదికగా బీజేపీ, ప్రధాని మోడీ ప్రభుత్వంపై ప్రకాశ్‌ రాజ్‌ విమర్శలు చేస్తున్నారు. మోడీ  నిర్ణయాలపై తనదైన శైలిలో విమర్శనాస్త్రాలు సంధించే ఆయన ఇప్పుడు ఏకంగా రాజకీయరంగ ప్రవేశానికే సిద్ధమయ్యారు. అయితే పొలిటికల్ ఎంట్రీ ఖాయమని చెప్పినా ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే దానిపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్నాటక రాష్ట్రాల్లో విశేష అభిమానులు ఉన్న ప్రకాశ్ రాజ్ ఈ మూడు రాష్ట్రాల్లో ఏదో ఒక రాష్ట్రం నుండి ఆయన నిలబడే అవకాశముందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.  
 

More Related Stories