English   

ఆ సీక్వెల్స్ పైనే ఇప్పుడు నాగార్జున ఆశ‌ల‌న్నీ..

Akkineni Nagarjuna hope on two sequel movies
2019-01-03 11:18:07

అనుకున్నది అనుకున్నట్లు జరిగితే అది సినిమా అవుతుంది కానీ జీవితం ఎందుకు అవుతుంది. ఇప్పుడు నాగార్జున విషయంలో కూడా ఇదే జరుగుతుంది. ఈయన మూడేళ్ల కింద వరకు వరుస విజయాలతో దూకుడు మీద ఉన్నాడు. ఇప్పుడు మాత్రం ఆ సీన్ కనిపించడంలేదు. ఊపిరి వరకు వరుస విజయాలు అందుకున్న నాగార్జున కెరియర్.. ఒక్కసారిగా రివర్స్ అయిపోయింది. ప్రస్తుతం ఒక విజ‌యం అంటూ వేచి చూస్తున్నాడు ఈ సీనియ‌ర్ హీరో. చివరికి భారీ అంచనాలతో వచ్చిన దేవదాసు కూడా ఫ్లాప్ అయ్యేసరికి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాడు మన్మధుడు. దాంతో ఇప్పుడు ఎలాగైనా విజయం అందుకోవాలనే కసితో ఉన్నాడు నాగార్జున. సీనియర్ దర్శకులను న‌మ్ముకుంటే ప‌ని జ‌రగ‌ద‌ని కుర్ర దర్శకులను నమ్ముకోవడమే మంచిది అని వాళ్లతోనే వరుస సినిమాలు చేస్తున్నాడు నాగార్జున.
ఇప్పటికే రాహుల్ రవీంద్రన్ తో ఓ సినిమాకు కమిట్ అయ్యాడు నాగార్జున. మన్మధుడు సినిమా సీక్వెల్ ఇది. ఒకప్పుడు త్రివిక్రమ్ కథ మాటలు అందించిన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. మళ్ళీ ఇన్నేళ్ళ తర్వాత ఇలాంటి సినిమాకు సీక్వెల్ చేయడం అంటే మాటలు కాదు. కానీ రాహుల్ చెప్పిన కథ నచ్చడంతో ముందడుగు వేస్తున్నాడు ఈ హీరో. ఈయనతో పాటు కళ్యాణ్ కృష్ణ కురసాల చెప్పిన బంగార్రాజు కథ కూడా నాగార్జునను ఆకట్టుకుంది. ఈ రెండు సినిమాలు ఖచ్చితంగా తన కెరియర్ కు మళ్లీ మంచి రోజులు తీసుకొస్తాయని నమ్ముతున్నారు ఈ గ్రీకువీరుడు. రాహుల్ సినిమా జనవరిలో పట్టాలెక్కుతుంటే బంగార్రాజు సినిమా జూన్ నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది. మరి ఈ రెండు సినిమాలతో నాగార్జున ఎలాంటి మాయ చేస్తాడో చూడాలి.

More Related Stories