English   

యష్ కి షాకిచ్చిన హైకోర్టు !

Yash
2019-01-03 13:16:32

కే జి ఎఫ్ సినిమాతో తెలుగువారికి పరిచయమైన కన్నడ రాక్ స్టార్ యష్ కి కర్ణాటక హైకోర్టు షాక్ ఇచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం యష్ అద్దెకు ఉంటున్న ఇంటి యజమానులకు ఇవ్వాల్సిన పూర్తి అద్దె చెల్లించి వెంటనే  ఆ ఇంటిని ఖాళీ చేయాలని కోర్టు తీర్పు ఇచ్చినట్టు సమాచారం. పూర్తి వివరాల్లోకి వెళితే బనశంకరి మూడో స్టేజ్ లో ఆరో బ్లాక్లో నెలకు నలభై వేలు అద్దె చెల్లిస్తూ యష్ కుటుంబం ఒక ఇంట్లో అద్దెకి ఉంటోంది. 

అయితే 2015లో ఆ ఇంటిని ఖాళీ చేయాలని ఆ ఇంటి యజమాని ముని ప్రసాద్ యష్ కుటుంబాన్ని కోరగా అందుకు యష్ కుటుంబం దానికి అంగీకరించ లేదు. ఎందుకంటే ఇంటి రిపేర్ కోసం పన్నెండున్నర లక్షల దాకా ఖర్చు పెట్టామని వీటిని అద్దెలో కట్  చేసుకోవాలని కోరారు. అయితే ఇంటి యజమానులు ఇందుకు అంగీకరించలేదు, దీంతో వారు బెంగళూరు సిటీ కోర్టును ఆశ్రయించారు. అక్కడ ఇంటి యజమానులకే అనుకూలంగా తీర్పు రావడంతో యష్ తల్లి హైకోర్టులో పిటిషన్ వేశారు. తాజాగా అక్కడ కూడా యష్ కుటుంబానికి చుక్కెదురయింది. ఇప్పటి దాకా ఇంటి యజమానులకు బాకీ పడ్డ 23 లక్షల 2019 మార్చి 31లోగా కట్టేసి ఆ ఇంటిని ఖాళీ చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. 

ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన యష్ తల్లి సినీ పరిశ్రమలోని కొందరు పెద్దలు కుట్ర కారణంగానే ఇంతవరకు వచ్చిందని, వాళ్ళు ఎంతగా దిగజారిపోయి కుట్రలు చేస్తారని తాను అనుకోలేదని పేర్కొన్నారు. మరోపక్క కన్నడ సినీ పరిశ్రమలోని కొంతమంది నటీనటుల మీద ఐటీ అధికారులు పంజా విసిరారు. ప్రముఖ నటులు, నిర్మాతలు, దర్శకుల ఇళ్లలో సోదాలను నిర్వహిస్తున్నారని సమాచారం. బెంగళూరులోని దాదాపు 60 ప్రాంతాల్లో ఏక కాలంలో ఈ సోదాలు జరుగుతున్నాయి. స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్, ముఖ్యమంత్రి కుమారస్వామి భార్య రాధిక ఇళ్లతో పాటు యష్ ఇంటిని కూడా అధికారులు జల్లెడ పడుతున్నారు. ఈ ఉదయం నుంచి ఈ మెరుపు దాడులు కొనసాగుతున్నాయి.  

More Related Stories