English   

మ‌హాన‌టితో క‌థానాయ‌కుడు పోటీ.. సావిత్రిని ఎన్టీఆర్ మ‌రిపిస్తాడా..?

balakrishna's Kathanayakudu release on january 9th
2019-01-06 16:41:51

ఎన్టీఆర్ బయోపిక్ బాధ్యతలు మరో దర్శకుడికి ఇచ్చి ఉంటే కచ్చితంగా ఈ సినిమాలో రెండేళ్లపాటు తీసేవాడు. కానీ క్రిష్ కాబట్టి ఆరు నెలల్లో ఔట్ పుట్ ఇచ్చేసాడు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతున్న తరుణంలో కొన్ని లక్ష్యాలను అధిగమించాల్సిన అవసరం ఉంది. ఎన్టీఆర్ బయోపిక్ అంటే ప్రేక్షకుల్లో చాలా అంచనాలుంటాయి. దాంతోపాటు పోలికలు కూడా ఉంటాయి. పైగా అన్నగారి జీవితం తెరిచిన పుస్తకం. అందులో దాచడానికి ఏమీ లేదు. అందుకే క్రిష్ కూడా ఈ విషయంపై చాలా జాగ్రత్తలు తీసుకొని బయోపిక్ తెరకెక్కించాడు. ఇక ఇప్పుడు కథానాయకుడికి ఓ సవాల్ ఎదురైంది. ఆ స‌వాల్ పేరు మహానటి. తెలుగులో బయోపిక్ ట్రెండ్ కు తెర తీసిన సినిమా ఇది.
అప్పటి వరకు కేవలం బాలీవుడ్లో మాత్రమే వస్తున్న బయోపిక్ లు తెలుగులో కూడా తీయొచ్చు అని నిరూపించిన సినిమా మహానటి. సావిత్రి జీవితం ఆధారంగా నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. సావిత్రి జీవితమే ఇంత‌ విజయం సాధిస్తే.. ఎన్టీఆర్ బయోపిక్ ఇంకెన్ని సంచలనాలు సృష్టించాలి అంటూ ఇండస్ట్రీలో అప్పుడే పోలికలు మొదలయ్యాయి. కచ్చితంగా ఈ సినిమా మహానటిని మించి ఉండాలని అభిమానులు కూడా ఆశిస్తున్నారు. ఆ సినిమా కమర్షియల్ గా విజయం సాధించడమే కాకుండా అవార్డుల పరంగా కూడా విదేశీ ఫిలిం ఫెస్టివల్స్ లో స‌త్తా చూపించింది.
ఇప్పుడు ఎన్టీఆర్ బయోపిక్ కూడా ఇదే చేస్తుందని నమ్ముతున్నారు అభిమానులు. క్రిష్ కూడా అదే స్థాయిలో తెరకెక్కించి ఉంటాడని న‌మ్ముతున్నారు కూడా. సావిత్రి జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు ఉన్నాయి. అలాగే ఎన్టీఆర్ జీవితంలో కూడా చాలానే ఉన్నాయి. అక్కడ నాగ్ అశ్విన్ అన్నీ చూపించాడా లేదా అనేది పక్కన పెడితే ప్రేక్షకులకు నచ్చేలా సినిమా చేశాడు. ఇప్పుడు క్రిష్ ఇదే చేసి ఉంటాడని అభిమానులతో పాటు ఇండస్ట్రీ కూడా నమ్ముతుంది. మొత్తానికి మహానటి సాధించిన సంచలన విజయం ఇప్పుడు ఎన్టీఆర్ స్టామినాకు సవాల్ గా మారింది. మరి ఆ చిత్ర విజయాన్ని కథానాయకుడు మరిపిస్తాడా లేదా అనేది జనవరి 9న తేలనుంది.

More Related Stories