English   

విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. అవుతున్నాడు బాలీవుడ్ బంగారుకొండ‌..

Vijay Deverakonda entry in bollywood
2019-01-06 09:49:37

మీ అమ్మ నిన్ను నీ కోసం కన‌లేదురా.. ఈ జనం కోసం క‌న్న‌ది అంటూ చత్రపతిలో డైలాగ్ గుర్తుంది కదా. ఇప్పుడు విజయ్ దేవరకొండని చూస్తే ఇదే అనిపిస్తుంది. ఈయన చేస్తున్న సినిమాలు కేవలం తెలుగు ప్రేక్షకుల కోసం కాదు ఇండియన్ ఆడియన్స్ కోసం. ఎందుకంటే విజయ్ దేవరకొండ ఓ సినిమాకు సైన్ చేశాడంటే అన్ని ఇండస్ట్రీల్లో ఆ సినిమా కోసం ఎదురు చూపులు క‌నిపిస్తున్నాయి. ఇప్పటికే ఈయన కెరీర్ ను మార్చేసిన పెళ్లిచూపులు సినిమాను హిందీలో రీమేక్ చేశారు. ఇక ఇప్పుడు అర్జున్ రెడ్డి సినిమాని కూడా షాహిద్ కపూర్ రీమేక్ చేస్తున్నాడు. ఒరిజినల్ ను తెరకెక్కించిన సందీప్ రెడ్డి వంగ అక్కడ కూడా ఈ చిత్రానికి దర్శకుడు. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే ఇప్పుడు మరో సినిమా కూడా హిందీలోకి వెళ్లడానికి సిద్ధం అవుతుంది.
అర్జున్ రెడ్డి విజయ్ దేవరకొండను యూత్ కు చేరువ చేస్తే.. ఆయన్ని కుటుంబ ప్రేక్షకులకు చేరువ చేసిన సినిమా గీతగోవిందం. పరుశురాం తెరకెక్కించిన ఈ చిత్రం దాదాపు 70 కోట్ల షేర్ వసూలు చేసి ఈయ‌న్ని స్టార్ హీరోగా మార్చేసింది. ఇప్పుడు ఈ సినిమాను హిందీలో రీమేక్ చేయబోతున్నారు. అక్కడ ధడక్ ఇషాన్ క‌ట్ట‌ర్ హీరోగా నటించబోతున్నాడని తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా హిందీలో రీమేక్ కానుంది. ప్రస్తుతం ఈ పాత్ర కోసం తనను తాను మార్చుకుంటున్నాడు ఇషాన్. ఇందులో హీరోయిన్ గా ఎవరు నటిస్తారనేది ప్ర‌స్తుతానికి సస్పెన్స్. త్వరలోనే దీనిపై కూడా ఓ క్లారిటీ రానుంది. మొత్తానికి తెలుగులో విజయ్ దేవరకొండ నటించిన సినిమాలన్ని ఇప్పుడు హిందీలో కూడా రీమేక్ అవుతున్నాయి. ఇదే అదునుగా ఆయన మంచి క‌థ‌ చూసుకొని ఈయ‌నే హిందీలోకి నేరుగా ఎంట్రీ ఇచ్చిన ఆశ్చర్యం లేదేమో.

More Related Stories