English   

పేటకు అది ప్లస్ అవుతుందా.. మైనస్ కానుందా..?

Rajinikanth's peta movie release on january 10
2019-01-06 17:12:10

అసలే ఈ మధ్య కాలంలో ఎప్పుడూ లేనంత తక్కువ అంచనాలతో వస్తుంది రజినీకాంత్ పేట సినిమా. ఇప్పుడు ఈ సినిమాను మరో అంశం కూడా భయపెడుతుంది. అదే ఈ చిత్రం నిడివి. సాధారణంగా రెండున్నర గంటలు ఉంటేనే సినిమా చూడడానికి ప్రేక్షకులు ఇబ్బంది పడుతున్న రోజులివి. అలాంటిది ఏకంగా మూడు గంటల నిడివితో వ‌స్తున్నాడు సూపర్ స్టార్. కథపై ఎంత నమ్మకం ఉన్నా కూడా మూడు గంటలు అంటే కాస్త ఆలోచించాల్సిందే. కానీ కార్తీక్ సుబ్బరాజ్ మాత్రం కచ్చితంగా ప్రేక్షకులను అలరిస్తుందని.. మూడు గంటల టైం ఉన్న కూడా అది తెలియనంత ఫాస్ట్ స్క్రీన్ ప్లే తో నడుస్తుందని చెబుతున్నాడు.
జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ చిత్రం. గత కొంతకాలంగా రజినీకాంత్ కోరుకుంటున్న విజయం ఏ సినిమా కూడా తీసుకురావడం లేదు. దాంతో ఆయన ఆశలన్నీ ఇప్పుడు పేట పైనే ఉన్నాయి. అందులోనూ భారీ పోటీ మధ్య వస్తుంది ఈ చిత్రం. ఇలాంటి సమయంలో కాస్త తక్కువ నిడివితో వచ్చుంటే బాగుండేది అనుకుంటున్నారు అభిమానులు. కానీ దర్శకుడు మాత్రం ఈ సినిమా విజయంపై నమ్మకంగా కనిపిస్తున్నాడు. ఇందులో విషయం ఉందని మూడు గంటలైనా ప్రేక్షకులు కచ్చితంగా చూస్తారంటూ ధీమాగా చెబుతున్నాడు కార్తీక్.
ఆయ‌న చెప్పిన దాంట్లో కూడా నిజం లేకపోలేదు. రంగస్థలం, అర్జున్ రెడ్డి లాంటి సినిమాలు మూడు గంటల నిడివితోనే వచ్చాయి. కాకపోతే అందులో పట్టు సడలని స్క్రీన్ ప్లే ఉంది. పేటలో కూడా అది ఉంటే ప్రేక్షకులు పడిపోతారు అనడంలో ఎలాంటి సందేహం లేదు... పైగా రజినీకాంత్ కూడా ఉన్నాడు. కానీ ఏమాత్రం తేడా జరిగినా ఫలితం దారుణంగా ఉంటుంది. మూడు గంటల సినిమా అంటే స్క్రీన్ ప్లే చాలా పక్కాగా ఉండాలి. అందులో ఏదైనా తేడా జరిగితే మాత్రం చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న ఫలితం ఉండదు. మరి ఏం జరుగుతుంది అనేది జనవరి 10న తేలనుంది.

More Related Stories