English   

టెన్ష‌న్ పెడుతున్న ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు ర‌న్ టైమ్.. 

NTR-Kathanayakudu
2019-01-08 05:37:47

ఈ రోజుల్లో ఎంత పెద్ద స్టార్ హీరోల సినిమా అయినా రెండున్నర గంటలకు మించి ఉంటే అభిమానులు ప్రేక్షకులు కాస్త బోర్ ఫీల్ అవుతున్నారు. అందుకే దర్శకులు కూడా వీలైనంత వరకు రెండున్నర గంటలలోపు సినిమాని ప్రేక్షకులకు చూపించడానికి సిద్ధమవుతున్నారు. కానీ ఇప్పుడు విడుదలకు సిద్ధమైన కథానాయకుడు సినిమా మాత్రం ఏకంగా రెండు గంటల యాభై నిమిషాల నిడివితో వస్తుంది. అన్న గారి బయోపిక్ కావడం.. ఆయన జీవితం ఆధారంగా సినిమా తెరకెక్కడంతో ఎంతసేపు ఉన్నా కూడా ప్రేక్షకులు చూస్తారని నమ్మకంగా ఉన్నాడు దర్శకుడు క్రిష్. పైగా ఇందులో బోర్ కొట్టే సన్నివేశాలు లేవని.. కథ కూడా అందంగా ఉంటుందని చెబుతున్నాడు దర్శకుడు. ఎన్టీఆర్ జీవితంలో మనకు తెలియని ఎన్నో కోణాలు ఉన్నాయని.. వాటిని కథానాయకుడులో ఆవిష్కరించాం అంటున్నాడు క్రిష్. తాజాగా ఈ చిత్రం సెన్సార్ సర్టిఫికెట్ బయటికి వచ్చింది. 

171 నిమిషాల నిడివితో కథానాయకుడు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. జనవరి 9న సినిమా విడుదల కానుంది. కథానాయకుడులో కొన్ని సన్నివేశాలు గుండెల్ని పిండేసేలా ఉంటాయని తెలుస్తోంది. ముఖ్యంగా దివిసీమ ఎపిసోడ్ సినిమాకు ఆయువుపట్టు. తాజాగా ఈ ఒక్క ఎపిసోడ్ పైన వెండితెర దొర అనే సాంగ్ విడుదలయింది. ఎన్టీఆర్ రాజకీయాల వైపు ఆకర్షితుడు కావడానికి ప్రధానంగా ప్రేరేపించింది దివిసీమ ఎపిసోడ్ అంటారు ఆయన సన్నిహితులు. అందుకే ఈ సీక్వెన్స్ పై క్రిష్ చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. దానికి తోడు భార్య బసవతారకంతో ఉండే ఎమోషనల్ సీన్స్ కూడా ప్రేక్షకులకు బాగా నచ్చుతాయి అంటున్నాడు క్రిష్. మొత్తానికి భారీ నిడివితో వస్తున్నా కూడా ఎన్టీఆర్ బయోపిక్ కచ్చితంగా ప్రేక్షకులకు నచ్చుతుందని నమ్మకంగా ఉన్నారు చిత్ర యూనిట్. నమ్మకం ఎంత వరకు నిజం అవుతుందో జనవరి 9న తేలనుంది.

More Related Stories