English   

ఎన్టీఆర్ కథానాయకుడు రివ్యూ

ntr kathanayakudu review and rating
2019-01-09 04:55:08

ఆంధ్రుల దైవం నందమూరి తారకరామారావు గారి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఎన్టీఆర్ కథానాయకుడు విడుదలైంది మరి ఈ చిత్రం ఎలా ఉంది ప్రేక్షకులను మెప్పించిన లేదా అనేది తెలుసుకుందాం.

కథ:

నందమూరి తారకరామారావు నిమ్మకూరు నుంచి పట్నం వచ్చి రిజిస్టరు గా పనిచేస్తుంటాడు. ప్రభుత్వ ఉద్యోగం అయినా కూడా అక్కడ జరిగే కొన్ని అన్యాయాలు ఆయన సహించలేకపోతాడు. ఆ తర్వాత భార్య పిల్లలను తీసుకుని మద్రాసుకు వచ్చి సినిమాల్లో చేరుతాడు ఎన్టీఆర్. అక్కడ ఎల్.వి.ప్రసాద్ ఈయనను సినిమా ఇండస్ట్రీకి మనదేశం సినిమాతో పరిచయం చేస్తాడు. ఆ తర్వాత మెల్లగా ఒక్కో సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న ఎన్టీఆర్.. 50 లోకి వచ్చేసరికి సూపర్ స్టార్ గా మారతాడు. ఎదురులేని హీరోగా తెలుగు ఇండస్ట్రీని ఏలుతుంటాడు ఎన్టీఆర్. అలాంటి సమయంలోనే దివిసీమ ఉప్పెన వస్తుంది. అప్పటివరకు సినిమా హీరోగా ఉన్న ఎన్టీఆర్ ప్రజల కష్టాలు దగ్గర నుంచి చూసిన తర్వాత రాజకీయాల్లోకి రావాలని ఫిక్స్ అయిపోతాడు. తెలుగుదేశం పార్టీని ప్రకటిస్తాడు. తర్వాత ఏం జరుగుతుంది అనేది వచ్చే భాగం మహానాయకుడులో తెలియనుంది.

కథనం:

అన్నగారి జీవితం గురించి ఏం చెప్పాలి.. ఎన్టీఆర్ జీవితం తెరిచిన పుస్తకం.. అక్కడ దాచి పెట్టాల్సిన పేజీలు ఏమీ లేవు.. దాచిపెట్టాల్సిన అవసరం కూడా లేదు ఆయనకు. అయితే ఎంత తెరిచిన పుస్తకం అయినా కూడా అందులో కనపడని పేజీలు కొన్ని ఉంటాయి. వాటిని క‌థానాయ‌కుడులో  చూపించే ప్రయత్నం చేశారు దర్శక నిర్మాతలు. ఎన్టీఆర్ జీవితంలో కొన్ని కీలకమైన ఘట్టాలను తీసుకొని కథానాయకుడు చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు క్రిష్. అన్న గారి జీవితంలో జరిగిన అతి ముఖ్యమైన సంఘటనలకు తెర రూపం ఇచ్చారు. వాటికి నందమూరి బాలకృష్ణ తనదైన అభినయంతో ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేశాడు. ఎన్టీఆర్ జీవితం ఎలా మొదలైంది.. ఆయన ఎలా సినిమాల్లోకి వచ్చారు.. ఎలా సూపర్ స్టార్ గా ఎదిగారు.. ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలే. అయితే వాటికి కాస్త సినిమాటిక్ టచ్ ఇచ్చి కమర్షియల్ హంగులు అద్దాడు క్రిష్. నిమ్మకూరులో మొదలైన ఎన్టీఆర్ ప్రయాణం.. కోట్లాదిమంది హృదయాల వరకు ఎలా చేరుకుంది అనే ఒక ప్రస్థాన‌మే కథానాయకుడు చిత్రం.

1940ల్లో ఎన్టీఆర్ తన భార్య.. చేతిలో ఒక కొడుకుతో చేస్తున్న ఉద్యోగం వదిలేసి మద్రాసుకు వచ్చి సినిమాల కోసం ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు.. అనే దగ్గర నుంచి ప్రజల కష్టాలు తన కష్టాలుగా భావించి రాజకీయాల వరకు ఎలా మారాడు అనేది ఈ చిత్రంలో ప్రధానంగా చూపించాడు దర్శకుడు క్రిష్. వాటి మధ్య లోనే అద్భుతమైన సన్నివేశాలు అనుకున్నాడు. ముఖ్యంగా ఎన్టీఆర్ కెరీర్లో చిరస్థాయిగా మిగిలిపోయిన ఎన్నో పాత్రలను బాలయ్యతో వేయించి ఔరా అనిపించాడు. అప్పటి పరిస్థితులను రీ క్రియేట్ చేస్తూ ఆర్ట్ డైరెక్షన్ టీమ్ పడిన కష్టాన్ని తెరపై చూపించాడు క్రిష్. ఫస్టాఫ్ అంతా పాత్రల పరిచయం కోసం కాస్త సమయం తీసుకున్న దర్శకుడు.. ఒక్కసారి వచ్చిన తర్వాత స్క్రీన్ ప్లేలో పరుగులు పెట్టించాడు. దివిసీమ ఎపిసోడ్ ఎమోషనల్ గా చాలా బాగా వర్కౌట్ అయింది.. ఆ తర్వాత ఎన్టీఆర్ రైల్వే స్టేషన్ ఎపిసోడ్.. భార్య బసవతారకంతో ఉన్న కొన్ని సీన్లు ఆకట్టుకున్నాయి. మిగిలిన సన్నివేశాలు బాగా రాసుకున్నాడు క్రిష్. అన్నగారి జీవితం అంటే తెలియని కథేమీ కాదు.. కానీ ఆ తెలిసిన కథలో తెలియని కోణాలను ప్రేక్షకులకు చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. తెలుగుదేశం పార్టీ ప్రకటనతో తొలిభాగం ముగుస్తుంది. ఈ విషయంలో ఆయన విజయం సాధించాడు.

నటీనటులు:

ఎన్టీఆర్ పాత్రలో నటించడం అంటే మాటలు కాదు.. ఆయనలా నటించడం ఎవరివల్లా కాదు.. ఇప్పుడు ఆయన తనయుడు బాలకృష్ణ ఈ బయోపిక్ లో తండ్రిలా నటించే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో ఆయన చాలా వరకు విజయం సాధించాడు కూడా. ఎన్టీఆర్ పాత్రలో ఒదిగిపోయి ప్రేక్షకులను మెప్పించాడు బాలయ్య. కథానాయకుడిగా తండ్రి వేసిన పాత్రలను తాను వేసి తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. బసవ తారకం పాత్రలో విద్యాబాలన్ బాగుంది. భర్తకు అన్ని విధాలుగా అండగా ఉండే సతీమణి పాత్రలో అద్భుతంగా నటించింది విద్యాబాలన్. అక్కినేని పాత్రకు ప్రాణం పోసాడు సుమంత్.. రూపురేఖల్లో కూడా తాతను గుర్తు చేశాడు. హరికృష్ణ పాత్ర‌లో కల్యాణ్ రామ్ బాగున్నాడు. కథానాయకుడులోనే నారా చంద్రబాబునాయుడు గా రానా కూడా పరిచయమయ్యాడు. ఇక మిగిలిన పాత్రలు ఎవరికి వారు పూర్తి న్యాయం చేశారు.

టెక్నికల్ టీం:

కథానాయకుడులో అగ్రతాంబూలం కీరవాణికి వెళ్తుంది. అద్భుతమైన ఆర్ ఆర్ తో సినిమాను మరింత ఎమోషనల్ గా మార్చేశాడు కీరవాణి. దానికి తోడు వెండితెర దొర.. కథానాయక పాటలు విజువల్ గా కూడా ఆక‌ట్టుకున్నాయి. సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది.. ఆర్ట్ డైరెక్షన్ కష్టం కళ్లముందు కనిపించింది.. మేకప్ డిపార్ట్మెంట్ తమ వంతు పాత్ర పోషించింది.. ఎడిటింగ్ బాగుంది. కానీ కొన్ని సీన్లు లాగినట్లు అనిపించాయి. నిడివి కాస్త తక్కువ ఉంటే బాగుండేమో అనిపించింది. దర్శకుడిగా క్రిష్ కు వంకలు పెట్టాల్సిన పనిలేదు. తన దగ్గరికి వచ్చిన స్క్రిప్ట్ పూర్తి స్థాయి న్యాయం చేశాడు దర్శకుడు. అన్నగారి బయోపిక్ ఎంత ఎమోషనల్ గా తెరకెక్కించాలో అంతా చేశాడు. మహానాయకుడు సినిమాను చేసే విధానాన్ని బట్టి ఎన్టీఆర్ బయోపిక్ ఎంత బాగా తెరకెక్కించాడు అనేది లెక్క‌లేసుకోవచ్చు.

చివరగా: కథానాయకుడు.. ఎమోషనల్ జర్నీ ఆఫ్ ఎన్టీఆర్..

More Related Stories