English   

అనిల్ రావిపూడి.. నువ్వు తోపు రాజా.. 

Anil-Ravipudi
2019-01-13 07:19:23

ఈ రోజుల్లో ఒక్క విజయం అందుకోడానికి నానా తంటాలు పడుతున్నారు దర్శకులు. అలాంటిది నాలుగు సినిమాలతో వరుసగా నాలుగు విజయాలు అందుకోవడం అంటే చిన్న విషయం కాదు. అందులోనూ రైటర్గా ఫ్లాపులు ఇచ్చి.. దర్శకుడిగా మారి వరుస విజయాలు అందుకోవడం నిజంగానే అద్భుతం. అనిల్ రావిపూడి విషయంలో ఇప్పుడు ఇదే జరుగుతుంది. ర‌చ‌యిత‌గా బిజీగా ఉన్నప్పుడు పెద్దగా విజయాలు చూసింది లేదు ఈయ‌న‌. దూకుడు సినిమా తప్ప మిగిలినవన్నీ అనిల్ రావిపూడి కలిసిరాలేదు. అది హిట్ అయినా కూడా ఈయ‌న‌కు పేరు రాలేదు. దాంతో బ‌య‌టికి వ‌చ్చి ద‌ర్శ‌కుడిగా మారాడు అనిల్. ఈయ‌న‌ దర్శకుడిగా మారిన తర్వాత టైమ్ అంతా మారిపోయింది. పటాస్ సినిమా తర్వాత ఒక్కసారిగా క్రేజ్ తెచ్చుకున్నాడు అనిల్ రావిపూడి. ఆ తర్వాత సుప్రీమ్, రాజా ది గ్రేట్ సినిమా కూడా విజయం సాధించడంతో అనిల్ స్టార్ డైరెక్టర్ అయిపోయాడు. 

ఇప్పుడు ఎఫ్2 సినిమా మంచి టాక్ సొంతం చేసుకుంది. సంక్రాంతి విన్నర్ ఇదే అంటూ తీర్పు ఇస్తున్నారు ప్రేక్షకులు. వరుసగా నాలుగో విజయం రావడంతో అనిల్ రావిపూడి క్రేజ్ ఇప్పుడు ఆకాశానికి చేరిపోయింది. ఈయ‌న‌తో పని చేయడానికి స్టార్ హీరోలు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. ఇలాంటి సమయంలో అనిల్ రావిపూడి ఎవరితో సినిమా చేస్తాడు అనేది ఆసక్తికరంగా మారింది ఇప్పుడు. ప్రస్తుతానికి మరోసారి దిల్ రాజు నిర్మాణంలోనే అనిల్ రావిపూడి సినిమా చేయబోతున్నాడని తెలుస్తోంది. బాలక్రిష్ణ కోసం ఒక కథ సిద్ధం చేసినట్లు ఎప్పటి నుంచో వార్తలు వినిపిస్తున్నాయి. ఈయ‌న‌తో పాటు వెంకటేష్ కోసం కూడా సిద్ధం చేశాడు అనిల్ రావిపూడి. ఈ కుర్ర ద‌ర్శ‌కుడితో మ‌రో సినిమా చేయ‌బోతున్న‌ట్లు వెంక‌టేష్ ఈ మ‌ధ్యే ప్ర‌క‌టించాడు కూడా. మరి ఈ సీనియర్ హీరోల్లో ఎవరితో అనిల్ సినిమా చేయబోతున్నాడు అనేది చూడాలి.

More Related Stories