English   

హిట్టు కొడతా..  అప్పుడూ మాట్లాడతా..!!

Sai-Dharam-Tej
2019-01-19 11:39:51

వరస విజయాలతో ఇండస్ట్రీకి దూసుకొచ్చిన మెగా మేనల్లుడు.. కొన్నేళ్లుగా దారుణంగా ఫ్లాప్ అవుతున్నాడు. ఈయన నటించిన సినిమాలు కనీసం వచ్చి వెళ్తున్నట్లు కూడా ప్రేక్షకులకు తెలియడం లేదు. ఒకప్పుడు పాతిక కోట్ల మార్కెట్ తెచ్చుకున్న సాయి ధరంతేజ్ ఇప్పుడు కనీసం అయిదు కోట్ల మార్కు కూడా అందుకోలేకపోతున్నాడు. కేవలం దర్శకుల బ్రాండ్ సినిమాలు చేసి చేతులు కాల్చుకున్నాడు మెగా మేనల్లుడు. దానికి తోడు ఆయన చుట్టూ ఉన్న కొందరు దర్శకులు కూడా సాయి ధరంతేజ్ ఇమేజ్ వాడుకోవాలని చెత్త కథలు ఆయనతో చేయించారు. ఒకటి రెండూ కాదు వరసగా ఆరు ఫ్లాప్ లు అందుకున్నాడు సాయి ధరంతేజ్. దాంతో ఈయన రెమ్యూనరేషన్ పై కూడా భారీ ప్రభావం చూపించింది. 

ఇప్పుడు ఈ కుర్ర హీరో డబ్బు కోసం కాకుండా కేవలం హిట్ కోసం పని చేస్తున్నాడు. అందుకే ఈ మధ్య కాలంలో రెండు సినిమాలకు చాలా తక్కువ రెమ్యూనరేషన్ తీసుకున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో చిత్రలహరి సినిమాలో నటిస్తున్నాడు. కిషోర్ తిరుమల తెరకెక్కిస్తున్న ఈ చిత్రం పై భారీ ఆశలే పెట్టుకున్నాడు మెగా మేనల్లుడు. కచ్చితంగా ఈ చిత్రం తనకు మళ్ళీ పునర్వైభవం తీసుకు వస్తుందని నమ్ముతున్నాడు. హిట్టు కొట్టిన తర్వాత రెమ్యూనరేషన్ గురించి మాట్లాడతాను అంటున్నాడు సాయి ధరంతేజ్. మరి ఈయన నమ్మకాన్ని చిత్రలహరి సినిమా ఎంత వరకు నిజం చేస్తుందో.. విజయం తీసుకు వస్తుందో లేదో చూడాలి. ఈ చిత్రంలో కల్యాణీ ప్రియదర్శన్, నివేదపేతురాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. త్వరలోనే సినిమా విడుదల కానుంది.

More Related Stories