English   

ప్రియదర్శి ‘మల్లేశం’ ఫస్ట్‌లుక్...కధ కాదిది జీవితం !

priyadarshi starrer mallesham movie first look is released
2019-02-03 14:32:41

వెండితెరపై మరో బయోపిక్ ఆవిస్కృతం కాబోతోంది. ఇప్పటి వరకు క్రీడాకారులు, సినీ తారలు, రాజకీయ నాయకులు వంటి సెలబ్రిటీల బయోపిక్కులని మనం వెండితెరపై చూశాం. కానీ మొట్టమొదటి సారి ఒక సాధారణ చేనేత కార్మికుడి జీవితాన్ని తెర మీద చూడబోతున్నాం. తెలంగాణలోని ఉమ్మడి యాదాద్రి జిల్లాలోని శారాజీపేటకు చెందిన చింతికింది మల్లేశం పేరు రెండేళ్ల క్రితం పెద్దగా ఎవరికీ తెలీదు. కానీ, పద్మశ్రీ అవార్డు అతన్ని వరించడంతో ఎవరీ మల్లేశం అంటూ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. నిజానికి ఒక చీరకు ఆసు పోయాలంటే దారాన్ని పిన్నుల చుట్టూ 9వేల సార్లు అటూ ఇటూ తిప్పాలి. ఆ రకంగా రోజుకి 18వేల సార్లు దారాన్ని కండెల చుట్టూ తిప్పితే రెండు చీరలను మాత్రమే నేయగలరు. రోజుకు రెండు చీరెలు నేస్తే కార్మికుడికి గిట్టుబాటు అవుతుంది కానీ దాని కోసం దారాన్ని కండెల చుట్టూ తిప్పడానికి మల్లేశం తల్లి లక్ష్మి చాలా కష్టపడి, చేతుల నొప్పితో బాధ పడేవారు. అమ్మ వేదన చూడలేకపోయిన మల్లేశం ఆమె కోసం ఏదైనా చేయాలని భావించి తన బుర్రకి పదును పెట్టి ఆసు యంత్రాన్ని తయారు చేశారు. దానికి అమ్మ పేరు మీదే లక్ష్మీ ఆసుయంత్రం అని పేరు పెట్టారు. దీనికి 2011 లో పేటెంట్ హక్కు కూడా లభించింది. ఈ యంత్రాన్ని కనిపెట్టినందుకుగాను తెలంగాణ రాష్ట్ర సిఫారుసు మేరకు 2017లో మల్లేశంకు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం అందజేసింది. ఒక సాధారణ చేనేత కార్మికుడు పద్మశ్రీ గ్రహీతగా ఎదిగిన తీరును ఇప్పుడు సినిమాటిక్ గా ఆవిష్కరిస్తున్నారు. మల్లేశం పాత్రను ప్రముఖ కమెడియన్ ప్రియదర్శి పులికొండ పోషించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమాకి సంబంధించి నేడు ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. 

More Related Stories