దేవి శ్రీ ప్రసాద్ తో ఇంకా తెగని త్రివిక్రమ్ వివాదం..

ఏమో ఇప్పుడు ఇండస్ట్రీలో పరిస్థితులు చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. ఇంకా దేవి శ్రీ ప్రసాద్ తో త్రివిక్రమ్ కు మునుపటి సాన్నిహిత్యం రాలేదని వార్తలున్నాయి. ఈ మధ్య కాలంలో డిఎస్పీతో త్రివిక్రమ్ కు పెద్దగా పడట్లేదనే టాక్ వినిపిస్తుంది. దీనికి సంకేతాలు కూడా బాగానే కనిపిస్తున్నాయి. అసలు దేవీ లేకుండా సినిమా చేయడానికి ఆలోచించే మాటల మాంత్రికుడు.. ఇప్పుడు ఆయన లేకుండానే అన్నీ బాగున్నాయి అంటున్నాడు. ఇండస్ట్రీలో ఉన్న గ్రేట్ కాంబినేషన్స్ లో త్రివిక్రమ్.. దేవీ శ్రీ ప్రసాద్ కూడా ఒకటి. ఈ ఇద్దరూ కలిస్తే వచ్చే సినిమా సూపరే. ఇప్పటి వరకు జల్సా, అత్తారింటికి దారేది, సన్నాఫ్ సత్యమూర్తి, జులాయి సినిమాలకు పనిచేసారు త్రివిక్రమ్, దేవీ. అన్నీ హిట్లే. పాటలైతే చెప్పాల్సిన పనిలేదు. ఇలాంటి ట్రాక్ రికార్డు ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ ను ఎవరూ విడిచిపెట్టరు. కానీ త్రివిక్రమ్ మాత్రం దేవిని కాదని అ..ఆ కోసం మిక్కీని తీసుకున్నాడు. అడిగితే బడ్జెట్ ప్రాబ్లం అన్నాడు.
అజ్ఞాతవాసి కోసం అనిరుధ్ ను పట్టుకొచ్చాడు. ఎందుకు అంటే కొత్తదనం కోసం అని సమాధానం చెప్పాడు. ఎన్టీఆర్ కు కూడా తమన్ తో తొలిసారి పనిచేశాడు. ఇప్పుడు బన్నీ కోసం మరోసారి ఆయనే కావాలంటున్నాడు. ఇదే కొత్త అనుమానాలకు తావిస్తుంది. త్రివిక్రమ్ తో దేవీకి ఏదో విషయంలో వాదన జరిగిందని తెలుస్తుంది. మరోవైపు అల్లు అర్జున్ మాత్రం తన సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ ఉంటే బాగుంటుందని త్రివిక్రమ్ తో ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. దానికి కారణం కూడా ఏమీ లేదు.. ఈ కాంబినేషన్ లో వచ్చిన గత రెండు సినిమాలకు దేవి సంగీతం అందించాడు. మంచి విజయం సాధించాయి. దాంతో మరోసారి ఆయన్నే రిపీట్ చేస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నాడు అల్లు అర్జున్. మరి దీనికి త్రివిక్రమ్ నుంచి ఎలాంటి సమాధానం వస్తుందనేది చూడాలి.