English   

నాగకన్యగా మారిన వరలక్ష్మీ శరత్ కుమార్ !

Varalakshmi
2019-02-08 12:48:29

గతంలో పాము నేపథ్యంలో సాగే ఎన్నో కథలు సినిమాలుగా తెరకెక్కాయి. అలా అని ఎన్ని సినిమాలు విడుదలయినా వాటిలో కొన్ని సినిమాలే భారీ విజయాలను అందుకున్నాయి. అయితే ఈ సీజన్ లో అయితే ఒక్క పాము సినిమా కూడా రాలేదు. మరి ఆడియన్స్ పాముని మిస్సవుతున్నారు అనుకున్నారో ఏమో గానీ చాలాకాలం తరువాత అలా పాము నేపథ్యంలో తమిళంలో ఒక సినిమా నిర్మితమవుతోంది ఆ సినిమా పేరే 'నీయా'. వరలక్ష్మి శరత్ కుమార్, రాయ్ లక్ష్మి, కేథరిన్ ప్రధాన పాత్రధారులుగా ఈ సినిమా తెరకెక్కుతోంది. జర్నీ హీరో జై ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్రలో కనిపించనున్నాడు. సురేశ్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాను, తెలుగులో 'నాగకన్య' పేరుతో విడుదల చేయనున్నారని సమాచారం. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఈ సినిమా నుంచి ఫస్టులుక్ పోస్టర్ ను వదిలారు. నాగకన్యగా వరలక్ష్మి శరత్ కుమార్ ఫస్టు పోస్టర్ ఆకట్టుకునేలా వుంది. వరలక్ష్మీ ఈ లుక్ లో పగబట్టిన నాగ కన్యగా కనిపిస్తున్నది. త్వరలోనే ఈ సినిమా ఆడియోను విడుదల చేయనున్నారు. జంబో సినిమాస్ బ్యానర్ పై శ్రీధర్ అరుణాచలం ఈ సినిమా నిర్మిస్తున్నారు. రాజ్వేల్ మోహన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ సినిమాకి షబ్బీర్ సంగీతం సమకూరుస్తున్నారు.  

More Related Stories