English   

ఎన్టీఆర్ మహానాయకుడుతో బాలకృష్ణ ముందున్న లక్ష్యాలు ఇవే..

NTR-Mahanayakudu
2019-02-21 15:08:36

కథానాయకుడు డిజాస్టర్ తర్వాత బాలకృష్ణతో పాటు చాలా మంది డిస్ట్రిబ్యూటర్ల ఆశలు కూడా ఇప్పుడు మహానాయకుడు సినిమాపైనే ఉన్నాయి. ఈ సినిమా కచ్చితంగా విజయం సాధిస్తుందని దర్శకుడు క్రిష్ తో పాటు హీరో బాలకృష్ణ కూడా నమ్ముతున్నాడు. దానికి కారణం సినిమా నిడివి కేవలం రెండు గంటల ఎనిమిది నిమిషాలు మాత్రమే ఉండటం. ఎప్పుడు మొదలై ఎప్పుడు అయిపోతుందో కూడా తెలియనంత వేగంగా సినిమా పూర్తి అయిపోతుందని.. అంత వేగంగా ఈ చిత్ర స్క్రీన్ ప్లే ఉంటుందని తెలుస్తోంది. ముఖ్యంగా సినిమాలో కొన్ని సన్నివేశాలు మనసుకు హత్తుకునేలా ఉంటాయని ప్రచారం జరుగుతుంది. దానికి తోడు ఈ సినిమా బాలకృష్ణకు కొన్ని లక్ష్యాలను నిర్దేశించింది. ఇప్పుడు అందులో అన్నిటికంటే ముఖ్యమైనది కథానాయకుడు సినిమాతో నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లను ఆదుకోవడం. 

మహానాయకుడు సినిమాను చాలా తక్కువ రేట్లకు అమ్మారని తెలుస్తోంది. అయితే చివరి మూమెంట్లో మళ్లీ డబ్బులు ఇవ్వకుండా బాలకృష్ణ హ్యాండ్ ఇచ్చాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. దాంతో డిస్ట్రిబ్యూటర్లు ఇప్పుడు బిక్కుబిక్కుమంటున్నారు. మహానాయకుడు సినిమాను దాదాపు 43 కోట్లకు అమ్మేశాడని తెలుస్తుంది. కథానాయకుడితో పోలిస్తే ఇది తక్కువే అయినా కూడా ఇప్పుడు బాలకృష్ణ సినిమాపై ఉన్న అంచనాలతో పోలిస్తే ఇది బాగా ఎక్కువ. సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ వస్తే తప్ప ఇంత వెనక్కి రావడం కష్టం. దానికితోడు కథానాయకుడులో మిస్సయిన ఎమోషనల్ కంటెంట్ ఈ సినిమాలో ఉంటే తప్ప ప్రేక్షకులు ఒప్పుకునేలా కనిపించడం లేదు. ఇవన్నీ పక్కన పెడితే కథానాయకుడు భజన ఎక్కువగా చేశారనే విమర్శలు వచ్చాయి. దాంతో మహానాయకుడులో అవి లేకుండా ఉంటేనే సినిమా విజయం సాధిస్తుంది. ఇలా కొన్ని లక్ష్యాలను దాటితే తప్ప విజయం బాలకృష్ణ సొంతం కాదు. మరి వాటిని నందమూరి వారసుడు అందుకుంటాడా లేదా అనేది చూడాలి.

More Related Stories