English   

ఎన్టీఆర్ మహానాయకుడు సినిమాపై నాదెండ్ల భాస్కరరావు రియాక్షన్..

Nadendla Bhaskar Rao Reacts On NTR Mahanayakudu
2019-02-24 03:10:12

మూలిగే నక్కపై తాటి పండు పడటం అంటే ఏంటో ఇప్పుడు ఎన్టీఆర్ మహానాయకుడు సినిమాను చూస్తే అర్థమవుతుంది. అసలే ఈ సినిమాకు కలెక్షన్లు రావడం లేదని దర్శక నిర్మాతలు తల పట్టుకున్నారు. చిన్న సినిమాలకు కూడా తీసిపోయే విధంగా మహానాయకుడు తొలి రోజు వసూళ్లు వచ్చాయి. కేవలం కోటిన్నర మాత్రమే వసూలు చేసి చరిత్రలో మిగిలిపోయే డిజాస్టర్ గా నిలిచిపోయింది ఎన్టీఆర్ మహానాయకుడు. ఇక ఇప్పుడు ఈ చిత్రంపై నాదెండ్ల భాస్కరరావు కూడా స్పందించారు. ఈ సినిమాలో ఈయన్ని మెయిన్ విలన్ గా చూపించారు. అప్పట్లో ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పటి నుంచి నాదెండ్ల భాస్కరరావు ఆయనకు తోడు నీడగా ఉన్నాడు. అయితే ఎన్టీఆర్ అమెరికాకు ఆపరేషన్ కోసం వెళ్లిన నెల రోజుల సమయంలోనే కాంగ్రెస్ తో కలిసి ముఖ్యమంత్రి పీఠం అధిష్టించాడు నాదెండ్ల భాస్కర రావు. దాంతో ఎన్టీఆర్ కు నమ్మక ద్రోహం చేశాడని.. వెన్నుపోటు పొడిచారని.. ఆయన వల్లే తెలుగుదేశం పార్టీలో లుకలుకలు వచ్చాయని సినిమాలో చూపించారు. దాంతో ఈ సినిమాపై రియాక్షన్ ఇచ్చాడు.

అప్పుడు ఏం జరిగింది అనేది నేటి తరం పిల్లలకు తెలియదని.. అప్పటి ప్రజలను అడిగితే అసలు ఏం జరిగిందనేది చెబుతారు అంటున్నాడు నాదెండ్ల భాస్కరరావు.  ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచినట్లు సినిమాలో చూపించారు కానీ నిజానికి ఎన్టీఆరే తనను వెన్నుపోటు పొడిచారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు నాదెండ్ల భాస్కరరావు. ఈ సినిమా తీస్తున్నప్పుడు తన పాత్ర గురించి ఎవరూ తనను సంప్రదించలేదని.. ఏం జరిగిందని అడగలేదని చెప్పాడు. వాళ్లకు తోచినట్లు వాళ్ళు ఒక సినిమా తీసి డబ్బుల కోసం నాటకాలు ఆడుతున్నారు సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు నాదెండ్ల భాస్కర రావు. చంద్రబాబు నాయుడు లేకపోతే ఆ రోజు తెలుగుదేశం పార్టీ మునిగిపోయేది అన్నట్లు సినిమాలో చూపించారని.. సెన్సార్ సభ్యులు ఎవరో వాళ్లకు కావలసిన వాళ్ళు ఉండటంతో తమకు నచ్చినట్లుగా ఒక సినిమా తీసి ప్రజల మీదికి వదిలేశారు అంటున్నాడు ఈ మాజీ ముఖ్యమంత్రి. నిజాలు ఏంటో ప్రజలకు తెలుసు కాబట్టే సినిమాను ఆదరించాలా లేదా అనేది వాళ్ళు చూసుకుంటారు అంటూ సెటైర్లు వేసాడు ఈయన.

More Related Stories