English   

క‌మెడియ‌న్ అలీ గుంటూరు తూర్పు నుంచి క‌న్ఫ‌ర్మ్..

Comedian Ali to contest from Guntur East
2019-03-03 09:22:33

పైకి కనిపించడం లేదు కానీ కమెడియన్ అలీ రాజకీయాలు బాగానే చేస్తున్నాడు. తనకు ఎవరు సీటు ఇస్తే వాళ్ళ దగ్గరికి వస్తానని ముందునుంచి చెబుతూనే ఉన్నాడు ఈ కమెడియన్. ఇక ఇప్పుడు ఈయన తెలుగుదేశం పార్టీ నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం దాదాపు ఖాయం అయిపోయింది. మొన్నటికి మొన్న 40 ఏళ్ల సినీ ప్రస్థానం వేడుకలో చంద్రబాబునాయుడు కూడా ఇదే విషయం కన్ఫర్మ్ చేశాడు. తెలుగుదేశం పార్టీకి అలీ లాంటి వాళ్ల అవసరం చాలా ఉంది అంటూ చెప్పాడు ఆయన. ఇలాంటి మంచి వాళ్ళు రాజకీయాల్లోకి వస్తే ప్రజలకు కూడా మంచి జరుగుతుందని చెప్పాడు ఏపీ ముఖ్యమంత్రి. దీన్నిబట్టి అలీ కోరుకున్న గుంటూరు తూర్పు సీటు ఇప్పుడు ఆయనకే వచ్చేలా కనిపిస్తుంది. దీని కోసం ఇద్దరు ముగ్గురు పరిశీలించినా చివరికి గుంటూరు ఈస్ట్ అలీకి దాదాపు ఖరారైపోయింది.
అందుకే ఈయన గుంటూరు ఈస్టులో తన ఓటు హక్కును ఇవ్వాలని ఎన్నికల సంఘాన్ని కోరుకుంటున్నారు. ఇప్పటికే ఈ దరఖాస్తు కూడా పూర్తి చేశాడు అలీ. త్వరలోనే దీనిపై పూర్తి క్లారిటీ రానుంది. ప్రస్తుతం సినిమాలు తగ్గించి రాజకీయాలపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టాడు అలీ. తనకు ఎమ్మెల్యే సీటు మాత్రమే ఇస్తే సరిపోదని.. కచ్చితంగా గెలిచిన తర్వాత మంత్రి పదవి కూడా కావాలి అంటున్నాడు ఈ కమెడియన్. అలా అని హామీ ఇస్తే తప్ప ఏ పార్టీ నుంచి పోటీ చేయాలి అనేది ఆలోచించుకుంటాన‌ని ఈ మధ్య ప్రకటించాడు. ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే తెలుగుదేశం నుంచి ఆయనకు మంత్రి పదవి కూడా హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అందుకోసమే చంద్రబాబునాయుడు పార్టీ నుంచి ఆయన పోటీ చేయడానికి సిద్ధమయ్యాడు. అన్నీ అనుకున్నట్లు జరిగితే గుంటూరు ఈస్ట్ నుంచి అలీ ఎన్నికల బరిలో దిగడం ఖాయంగా కనిపిస్తోంది.

More Related Stories