English   

మా అసోసియేషన్ లో తగ్గని వేడి.. నరేష్, నాగబాబుపై శివాజీరాజా సంచలన వ్యాఖ్యలు..

Shivaji-Raja
2019-03-19 07:51:35

ఎలక్షన్స్ లో ఓడిపోయిన తర్వాత కూడా ఇంకా కూర్చి పట్టుకుని వేలాడుతున్నాడు.. తాము మంచి పనులు చేస్తామంటే చేయకుండా వెనక్కి లాగుతున్నారు.. శివాజీరాజా ఫోన్ చేసి బెదిరిస్తున్నాడు అంటూ కొన్ని రోజులుగా నరేష్ మీడియా ముందుకు వచ్చి సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కూడా మా అసోసియేషన్ అధ్యక్ష పదవిపైనే శివాజీరాజా ఇంకా కూర్చున్నాడని.. ప్రమాణస్వీకారం చేసుకోవడానికి మార్చి 22 ముహూర్తం ఫిక్స్ చేసుకున్న తర్వాత కూడా ఆయన ఇవ్వడం లేదని మీడియా ముందుకు వచ్చి చెప్పాడు నరేష్. ఆయనతో పాటు జీవిత రాజశేఖర్ కూడా వచ్చి మా అసోసియేషన్ లో చాలా లొసుగులు ఉన్నాయని.. మేము నిజాయితీగా పని చేయాలనుకుంటే మమ్మల్ని వెనక్కి లాగేస్తున్నారు అంటూ సంచలన ఆరోపణలు చేసింది. ఇవన్నీ జరుగుతున్నా కూడా శివాజీరాజా ఇప్పటివరకు బయటకు వచ్చింది లేదు నిజాలు మాట్లాడింది లేదు. అయితే ఇప్పుడు మీడియా ముందుకు వచ్చాడు శివాజీరాజా. 

తాను అడిగే ప్రశ్నలకు నరేష్ తో పాటు ఆయన వర్గం కూడా సమాధానం చెప్పే దమ్ము ఉందా అంటూ ఫైర్ అయ్యాడు. మా రూల్స్ ప్రకారం అధ్యక్ష పదవిలో ఉన్న ఆయన డైరీలు వెయ్యాలి.. ఈసారి నరేష్ నేను వేస్తాను అంటూ ముందుకు వచ్చాడని.. అయితే అలా వేసినప్పుడు అకౌంట్ లో ఎంత ఉందో కూడా రాయాలి అంటున్నాడు. శివాజీ రాజా 14 లక్షలు అని రాసినప్పుడు అకౌంట్లో 7 లక్షలు మాత్రమే ఉన్నాయని.. మరి మిగిలిన ఏడు లక్షలు ఎక్కడికి వెళ్లాయో సమాధానం చెప్పిన తర్వాత నరేష్ అధ్యక్ష పదవిపై కూర్చుంటే బాగుంటుంది అంటున్నాడు శివాజీ రాజా. అలాగే నాగబాబుకి కూడా రిటర్న్ గిఫ్ట్ ఖచ్చితంగా ఇస్తానని అది ఎలా ఉంటుందో ఇప్పుడు చెప్పను కచ్చితంగా తర్వాత చెప్తానన్నారు శివాజీరాజా. 

మా అసోసియేషన్ అభివృద్ధి పనుల్లో చిరంజీవి గారికి తాను ఎప్పుడు రుణపడి ఉంటానని.. మీరు భవనం కోసం డబ్బులు సిద్ధం చేసుకుంటే కేటీఆర్ తో మాట్లాడి నేను సైట్ ఇప్పిస్తానంటూ చిరంజీవి మాట ఇచ్చాడని గుర్తుచేసుకున్నాడు ఈయన. ఇది తన హయాంలోనే అయిపోతుంది అనుకున్నాను కానీ అదృష్టం తనకు లేదు అంటున్నాడు శివాజీరాజా. మానిఫెస్టోలో చెప్పిన ప్రతి పని నరేష్ చేసి చూపిస్తే వచ్చే ఎన్నికల్లో కూడా ఆయన అధ్యక్షుడుగా ఉండేలా నేను చేస్తాను అంటూ హామీ ఇచ్చాడు శివాజీ రాజా. తనకు పదవీ కాంక్ష లేదని ఇప్పటికే రెండు సార్లు ట్రెజరర్ గా.. రెండు సార్లు వైస్ ప్రెసిడెంట్ గా.. ఒకసారి ప్రెసిడెంట్ గా ఉన్న తనకు ఇంకా పదవి మీద మోజు ఉంటుందా అని ప్రశ్నించాడు శివాజీ రాజా. ఏదేమైనా మా ఎన్నికలు ముగిసిన పది రోజులు గడుస్తున్నా కూడా ఇప్పటికీ ఆ వేడి మాత్రం తగ్గడం లేదు. మరి చివరికి ఇది ఎక్కడ ముగుస్తుందో తెలియడం లేదు. దయచేసి ఇంకెవరు వచ్చి మీడియా సమావేశాలు పెట్టి మా అసోసియేషన్ పరువు తియ్యొద్దు అంటున్నాడు శివాజీ రాజా.

More Related Stories