English   

సంచలనాలు సృష్టిస్తున్న విజయ్, అట్లీ కుమార్ సినిమా..

Atlee-vijay
2019-03-21 09:13:35

తమిళనాట నెంబర్ వన్ హీరో ఎవరు అంటే ఇప్పుడు రజినీకాంత్ అని సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గత మూడు దశాబ్దాలుగా తమిళ ఇండస్ట్రీలో ఆయన పేరు తప్ప మరొకరి పేరు వినిపించడం లేదు. ఇప్పుడు చరిత్ర కొత్తగా తిరగరాయడానికి విజయ్ బయలుదేరుతున్నాడు. ఈయన ఒక్కో సినిమా చేస్తుంటే బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు రేగుతున్నాయి. గత కొన్నేళ్లుగా విజయ్ సినిమా వచ్చింది అంటే చాలు సరికొత్త చరిత్రకు పునాది పడుతుంది. దానికి తోడు ఆయన ఎంచుకుంటున్న కథలు కూడా అలాగే ఉన్నాయి. ఇక ఇప్పుడు ఈయన అట్లీ కుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఇది ఒలంపిక్స్ నేపథ్యంలో తెరకెక్కుతుంది. ఇందులో ఫుట్ బాల్ కోచ్ గా నటిస్తున్నాడు విజయ్. ఇదిలా ఉంటే ఈ చిత్ర షూటింగ్ ఇప్పటికే సగానికిపైగా పూర్తి అయిపోయింది. దాదాపు 100 కోట్ల బడ్జెట్ తో ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. దసరాకు సినిమా విడుదల కానుందని ఇప్పటికే ప్రకటించారు దర్శక నిర్మాతలు. టైటిల్ కూడా అనౌన్స్ చేయకముందే ఈ చిత్రం బిజినెస్ మరో స్థాయిలో జరుగుతుంది. ఇప్పటికే శాటిలైట్ డిజిటల్ రైట్స్ రూపంలో నిర్మాతలకు 50 కోట్లు వచ్చేసాయి. థియేట్రికల్ రైట్స్ కు సంబంధం లేకుండా కేవలం విడుదలకు ముందే ఎంత అమౌంట్ వస్తే రేపు సినిమా విడుదలైన తర్వాత ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తుందో అని లెక్కలు వేసుకుంటున్నారు ట్రేడ్ పండితులు. దానికితోడు విజయ్ అట్లీ కుమార్ కాంబినేషన్లో గతంలో వచ్చిన తెరి, మెర్సల్ సినిమాలు సంచలన విజయం సాధించాయి. దాంతో ఇప్పుడు మూడోసారి కూడా ఇలాంటి అద్భుతం చేస్తారని నమ్ముతున్నారు అభిమానులు. ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. విల్లు తర్వాత మరోసారి వీళ్లిద్దరు కలిసి నటిస్తున్నారు. మొత్తానికి విడుదలకు ముందే విజయ్ సినిమా ఇప్పుడు కొత్త చరిత్రకు తెర తీస్తోంది.

More Related Stories