English   

మా అధ్యక్ష ప్రమాణ స్వీకారంలో కోట శ్రీనివాసరావుకు ఘోర అవమానం..

Kota-Srinivasa-Rao
2019-03-23 02:08:48

మా నూతన అధ్యక్షుడు ప్రమాణ స్వీకారంలో సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావుకు ఘోర అవమానం జరిగింది. ఈ మధ్య కాలంలో బయటికి రావడం పూర్తిగా తగ్గించేసిన ఈ సీనియర్ నటుడు.. తాజాగా అధ్యక్ష పదవి ప్రమాణ స్వీకారానికి వచ్చాడు. ఈయనతో పాటు స్టేజీపై ఎస్పీ బాలసుబ్రమణ్యం, సూపర్ స్టార్ కృష్ణ, రెబల్ స్టార్ కృష్ణంరాజు కూడా ఉన్నారు. వాళ్ళ అందరి సమక్షంలో నూతన అధ్యక్షుడిగా సీనియర్ నరేష్ ప్రమాణ స్వీకారం చేశాడు. ఈ సందర్భంగా కోట శ్రీనివాసరావు మాట్లాడుతూ తెలుగు నటులకు గౌరవం ఇవ్వాలని.. ఎక్కడో పరభాషా నటులకు లక్షలకు లక్షలు ఎందుకు ఇస్తున్నారు అంటూ ప్రశ్నించాడు. హిందీ నుంచి.. ఇతర భాషల నుంచి అమితాబ్, నానా పటేకర్ లాంటి నటులను తీసుకు వచ్చినప్పుడు తాను ఎప్పుడూ అభ్యంతరం చెప్పలేదని.. కానీ కనీసం ఎక్స్ప్రెషన్ కూడా సరిగ్గా పెట్టలేదని కొందరు నటులను తీసుకొచ్చి ఇక్కడ లక్షలు ఇచ్చి పోషిస్తున్నారు అని విమర్శించాడు కోట శ్రీనివాసరావు. ఇక సాయాజీ షిండే అనే నటుడికి అసలు యాక్టింగ్ వచ్చా అంటూ కోట ప్రశ్నించాడు. ఇలా తెలుగు నటులకు అవకాశం ఇవ్వండి పరభాషా నటులను తగ్గించండి అని మాట్లాడుతున్న తరుణంలో సీనియర్ నరేష్ వచ్చి స్పీచ్ ఆపాలి అని చెప్పడం సంచలనంగా మారింది. ప్రమాణ స్వీకారానికి సమయం దగ్గర పడుతుందని.. త్వరగా ముగించాలి అంటూ కోట శ్రీనివాసరావు చెవిలో చెప్పాడు నరేష్. ఈ విషయాన్ని కోట చాలా సీరియస్ గా తీసుకున్నాడు. తెలుగు వాళ్ల గురించి మాట్లాడుతున్నాను కాబట్టి ఎవరికీ నచ్చడం లేదని తనను క్షమించాలి అంటూ మైక్ నరేష్ చేతికిచ్చాడు. ఇదే సూపర్ స్టార్ కృష్ణ మాట్లాడుతున్నప్పుడు ఆపమని అని చెప్పే దమ్ముందా.. మైక్ లాక్కుంటారా అంటూ ప్రశ్నించాడు కోట శ్రీనివాసరావు. తాను కాబట్టి.. అందులోనూ తెలుగు నటుల గురించి మాట్లాడుతున్నాను కాబట్టి ఎవరికీ నచ్చడం లేదని.. అక్కడ ఉన్న మా అసోసియేషన్ సభ్యులతో పాటు కార్యవర్గ సభ్యులకు కూడా పాదాభివందనం తెలియజేసుకుంటున్నాను అంటూ ముగించాడు కోట శ్రీనివాసరావు. ఇలాంటి లెజెండ్రీ నటున్ని అంత దారుణంగా అవమానించడం ప్రేక్షకులకు కూడా నచ్చలేదు. అక్కడ నరేష్ తీరుపై చాలామంది విమర్శలు గుప్పించారు. ఇప్పుడే ఇలా ఉంటే రాబోయే కాలంలో మరింత దారుణంగా పరిస్థితి ఉంటుందని మా అసోసియేషన్ సభ్యులే మాట్లాడుతూ ఉండటం గమనార్హం.

More Related Stories