English   

లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా అసలు విడుదల అవుతుందా లేదా..

Lakshmis-NTR
2019-03-23 02:18:29

అభిమానుల్లోనే కాదు సాధారణ ప్రేక్షకుల్లో కూడా ఇప్పుడు ఇవే అనుమానాలు వస్తున్నాయి. ఎందుకంటే ఒక్కో రోజు గడుస్తుంటే విడుదల తేది దగ్గర పడుతుంది. మరోవైపు రామ్ గోపాల్ వర్మ మాత్రం అన్ని న్యూస్ చానల్స్ తిరుగుతూ ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. తన సినిమా అనుకున్న తేదీకి కచ్చితంగా విడుదలవుతుంది రాసిపెట్టుకోండి అంటూ సవాల్ చేస్తున్నాడు. మరోవైపు తెలుగుదేశం పార్టీ మాత్రం ఈ సినిమాను ఎట్టి పరిస్థితుల్లో విడుదల కాకుండా అడ్డుకోవాలని ప్రయత్నిస్తోంది. దీని కోసం సర్వశక్తులూ ఒడ్డుతోంది. సెన్సార్ బోర్డు కూడా ఇప్పటి వరకు లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా సెన్సార్ చెయ్యలేదు. నిజానికి మార్చి 22వ తేదీన ఈ సినిమా సెన్సార్ పూర్తయిపోవాలి. ఈ మేరకు నిర్మాతలు సెన్సార్ తేదీ కూడా బుక్ చేసుకున్నారు. అయితే సెన్సార్ బోర్డ్ చీఫ్ ఆఫీసర్ రాజశేఖర్ మాత్రం తనకు ఈ సినిమా చూడటానికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయని.. దాని కోసం మరింత సమయం కావాలంటూ రామ్ గోపాల్ వర్మ కు చెప్పినట్లు తెలుస్తోంది. ఇబ్బందులు ఉన్నాయని చెబుతున్న రాజశేఖర్ అవి ఏంటి అని అడిగితే మాత్రం చెప్పకపోవడం గమనార్హం. దీనిపై రామ్ గోపాల్ వర్మ కూడా కాస్త సీరియస్ గానే ఉన్నట్లు తెలుస్తోంది. సినిమా కచ్చితంగా మార్చి 29న విడుదల కావాల్సిందేనని.. లేదంటే న్యాయపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది అంటూ వార్నింగ్ ఇస్తున్నాడు. తాను ఇండియన్ సెన్సార్ బోర్డుకు లోబడి సినిమా తెరకెక్కించానని.. మీకు ఏవైనా అభ్యంతరకర సన్నివేశాలు ఉంటే నిరభ్యంతరంగా వాటిని తీసేయొచ్చు అంటున్నాడు వర్మ. అంతేగాని సినిమా విడుదలను ఆపేస్తాం అంటే మాత్రం పరిస్థితి మరోలా ఉంటుంది అంటున్నాడు ఈ సంచలన దర్శకుడు. మొత్తానికి ఈ తీరు అంతా చూస్తుంటే అసలు మార్చి 29న లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదలవుతుందనడంలో మాత్రం చాలా అనుమానాలు కనిపిస్తున్నాయి.

More Related Stories