English   

మెగా వార‌సుడు రామ్ చ‌ర‌ణ్ బ‌ర్త్ డే స్పెష‌ల్.. కెరీర్ విశేషాలు.. 

Ram-Charan
2019-03-27 04:25:37

రామ్ చరణ్.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తెలుగు ప్రేక్షకులంద‌రికీ ఇప్పటికే బాగా పరిచయం అయిపోయాడు మెగా వారసుడు. ఒకప్పుడు కేవలం విమర్శలు త‌ప్ప‌ ప్రశంసలు అనేవి తెలియకుండా కెరీర్ మొదలు పెట్టిన రామ్ చరణ్.. ఇప్పుడు అందనంత స్థాయిలో ఉన్నాడు. ఒక్కో సినిమాతో తనలోని మైనస్ లను ప్ల‌స్ లుగా మార్చుకుంటూ కెరీర్ లో ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వస్తున్నాడు రామ్ చ‌ర‌ణ్. 12 ఏళ్ల కింద చిరుత సినిమాతో ఎంట్రీ ఇచ్చినప్పుడు అసలు ఆయనకు నటన వచ్చా.. చిరంజీవి వారసుడు అంటే ఎలా ఉండాలి అంటూ విమర్శించారు. మగధీర సినిమాతో నే ఇండస్ట్రీ రికార్డులు తిరగ రాసినా కూడా ఆ క్రెడిట్ మొత్తం తీసుకెళ్లి రాజమౌళికి ఇచ్చారు. అయినా కూడా రామ్ చరణ్ తన వంతు ప్రయత్నం చేస్తూనే వ‌చ్చాడు. ఆరెంజ్ లాంటి కొత్త కథను నమ్మి ప్రయోగం చేశాడు. అయితే అది నిరాశపరిచింది. కానీ వెంటనే రచ్చ లాంటి మాస్ సినిమాతో మరోసారి బాక్సాఫీసుపై దండయాత్ర చేశాడు మెగా వారసుడు. ఇక ఆ తరువాత వెనుతిరిగి చూసుకోకుండా ఎవడు, నాయక్ లాంటి సినిమాలతో వరుస విజయాలు అందుకొన్నాడు. మధ్యలో బాలీవుడ్ వెళ్లి జంజీర్ సినిమాతో డిజాస్టర్ మూటగట్టుకున్నా కూడా చేసిన త‌ప్పు తెలుసుకుని మళ్లీ తెలుగు ఇండస్ట్రీకి వచ్చి వరస సినిమాలు చేస్తున్నాడు రామ్ చరణ్. గోవిందుడు అందరివాడేలే సినిమాతో కుటుంబ ప్రేక్షకులను అలరించాడు. ఆ తర్వాత రొటీన్ కథలు చేస్తున్నాడనే విమర్శలు పోగొట్టుకుంటూ ధ్రువ సినిమాతో విజయం అందుకొన్నాడు. ఇక రంగస్థలం సినిమాతో తనలోని నటుడిని బయటికి తీసుకొచ్చాడు మెగా వారసుడు. అప్పటివరకు ఆయనపై విమర్శల వర్షం కురిపించిన వాళ్లే రంగస్థలం సినిమా చూసి రామ్ చరణ్ ఎంత గొప్ప నటుడో అంటూ ప్రశంసించారు. ఈ మధ్యే విడుదలైన బోయ‌పాటి శ్రీను వినయ విధేయ రామ‌ సినిమా డిజాస్టర్ అయినా ఇప్పుడు రాజమౌళి సినిమాతో బిజీగా ఉన్నాడు మెగా వారసుడు. ఈ సినిమాతో మరోసారి చరిత్ర సృష్టించడానికి సిద్ధమవుతున్నాడు రామ్ చరణ్. మార్చి 27న ఈయ‌న పుట్టినరోజు.. 33 ఏళ్లు పూర్తి చేసుకుని 34 వడిలోకి అడుగు పెడుతున్నాడు మెగా వారసుడు. ఇలాంటి పుట్టినరోజులు ఇంకా ఎన్నో జరుపుకోవాలని అభిమానులు మనసారా ఆశిస్తున్నారు.

More Related Stories