English   

బంపర్ ఆఫర్ కొట్టిన పరశురామ్

Mahesh Babu Movie with Director Parasuram
2019-05-08 21:38:01

డైరెక్టర్ పరశురామ్ అంటే గుర్తుపట్టరేమో కానీ గీత గోవిందం డైరెక్టర్ అనగానే ఇట్టే గుర్తు పట్టేస్తారు. అంతలా ఆయనకు క్రేజ్ తెచ్చి పెట్టింది ఈ సినిమా. అద్భుతమైన కధేమీ కాదు ! సాదా సీదా కధే కానీ ఆయన టేకింగ్ ఆ సినిమాని అందమైన ప్రేమకథాంశంగా మార్చింది. చాలా తక్కువ బడ్జెట్ లో తెరకెక్కిన ఈ సిన్మా వసూళ్ల విషయంలో మాత్రం కొత్త రికార్డులను సృష్టించింది. దర్శకుడిగా పరశురామ్ కి ఈ సినిమా ఒక మైలురాయిగా నిలిచిపోయింది. అంతటి హిట్ కొట్టినా ఆయన తదుపరి సినిమా ఇంకా ప్రకటించలేదు. ఆయనకు లైఫ్ ఇచ్చింది గీతా కాంపౌండ్ కాబట్టి ఆ కాంపౌండ్ కే సినిమాలు చేస్తాడు అంటూ అప్పట్లో ప్రచారం జరిగింది. ఈ నేపధ్యంలో సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్, బన్నీ లాంటి హీరోలతో సినిమా ఉంటుందని ప్రచారం జరిగింది. అయితే అనూహ్యంగా ఆ లిస్ట్ లోకి మరో పేరు వచ్చి చేరింది.

అదే సూపర్ స్టార్ మహేష్ బాబు పేరు. ఈ మధ్య కాలంలో మహేష్ బాబును కలిసిన పరశురామ్ ఆయనకు తాను సిద్ధం చేసిన కథను వినిపించాడట. కథ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందని చెప్పిన మహేష్ పూర్తి స్క్రిప్ట్ ను సిద్ధం చేసుకురమ్మని చెప్పాడట. దీంతో ప్రస్తుతం స్క్రిప్ట్ ని డెవలప్ చేసే పనిలో పరశురామ్ వున్నాడని అంటున్నారు. అనిల్ రావిపూడి సినిమా తరువాత మహేశ్ బాబు సెట్స్ పైకి వెళ్లేది జక్కన్న సినిమా అని ప్రచారం జరుగుతున్నా అప్పటికి ఆర్ఆర్ఆర్ అవడం కష్టం కాబట్టి మహేష్ పరశురామ్ తోనే తన తదుపరి సినిమా చేయనున్నాడని అంటున్నారు. ఈ సినిమా గీతా ఆర్ట్స్ బ్యానర్లోనే వుండనుందని అంటున్నారు. దీని మీద అధికారిక ప్రకటన వస్తే కానీ ఏమీ మాట్లాడలేం.

More Related Stories