జగన్ చేసి చూపాలి...అందరూ విహారయాత్రలకు వెళ్ళండి : నాగబాబు

పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం లోక్ సభ స్థానం నుంచి జనసేన అభ్యర్థిగా పోటీచేసి ఓటమిపాలైన మెగా బ్రదర్ నాగబాబు ఎన్నికల ఫలితాలపై ఓ వీడియో రిలీజ్ చేశారు. ఆయనకు నా ఇష్టం పేరుతో ఒక ఛానెల్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వీడియో రిలీజ్ చేసిన నాగబాబు ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించారంటూ జగన్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. జగన్ కు ఏపీ ప్రజలు అద్భుతమైన మెజారిటీ అందించారని, అందుకే జగన్ ప్రజలకు రుణపడి ఉంటారని తెలిపారు. ప్రధానంగా తన నవరత్నాల కాన్సెప్ట్ ను జగన్ ఈ ఐదేళ్లలో చేసి చూపించాల్సి ఉంటుందని, ప్రజల్లో ఆ నమ్మకం కలిగించాలని స్పష్టం చేశారు. ఏపీలో జగన్ సుపరిపాలన అందించే క్రమంలో తమ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని చెప్పారు. జనసేన ఓటమికి ఎవరూ బాధ పడాల్సిన పనిలేదని పార్టీ గెలుపు కోసం పనిచేసిన అందరికీ కృతజ్ఞతలు అని పేర్కొన్నారు. జనం క్లీన్ పాలిటిక్స్ కోరుకుంటున్నారని, తాము పైసా కూడా పంచకుండానే లక్షల ఓట్లు సాధించినట్టు చెప్పారు. జనసేన సాంకేతికంగా గెలవకున్నా నైతికంగా గెలిచామని పేర్కొన్నారు. జనసేన గెలుపు కోసం ఎన్నికల్లో పనిచేసిన వీర మహిళల బాధ చూసి తనకు నిజంగా బాధగా ఉందని జనసైనికులు అందరూ ఓ నెల రోజులు భార్య/భర్తలతో కలిసి విహారయాత్రలకు వెళ్లి రిలాక్స్ అవాలని సూచించారు. దీంతో మన నుంచి ఒత్తిడి దూరమవుతుందని భవిష్యత్తులో ఎలా ముందుకెళ్లాలన్న విషయంపై ఈలోగా పవన్ కార్యాచరణ రూపొందిస్తారని అన్నారు.