English   

ఎన్టీఆర్ అప్పుడే రాజకీయాలు మొదలుపెట్టాడా ?

  Jr NTR
2019-05-28 18:27:35

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ, తెదేపా వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారకరామారావు 97వ జయంతి ఈరోజ. ఈ సందర్భంగా ఆయన మనవళ్లు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్‌రామ్ తాతకు నివాళులర్పించారు. తెల్లవారుజామున 5.30గంటలకు ఎన్టీఆర్‌ ఘాట్‌కు వచ్చిన జూనియర్‌ ఎన్టీఆర్‌, కల్యాణ్‌రామ్‌ ఆయన సమాధి వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. అయితే ఎన్టీఆర్ జయంతి అయినా హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ మాత్రం కనీస అలంకరణలేక బోసిపోయింది. నిజానికి ప్రతి సంవత్సరం ఎన్టీఆర్ జయంతి నాటికి ఘాట్ కి పలురకాల పూలు తెచ్చి, ఎన్టీఆర్ స్మారకాన్ని తీర్చిదిద్దుతారు. కానీ ఈ సంవత్సరం మాత్రం ఘాట్ ను అలాగే వదిలేశారు. తెలుగుదేశం పార్టీ ఘోర ఓటమితో విషాదంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కనీసం పెచ్చులూడిన భాగాలకు మరమ్మతులు కూడా చేయించలేదు. ఈ ఉదయం ఎన్టీఆర్ ఘాట్ కు వచ్చిన జూనియర్ ఎన్టీఆర్, తన తాతయ్య సమాధిని అలా చూసి, ఒకింత అసహనానికి గురయ్యారు.  వెంటనే భారీగా పుష్పాలను తెప్పించి తానే స్వయంగా తాత సమాధిని అలంకరించారు. అక్కడే ఉన్న అభిమానుల సాయంతో సమాధి మొత్తం పూలతో అలంకరించాలని అక్కడే ఉన్న అభిమానులకి ఆదేశాలు జారీ చేసిన ఎన్టీఆర్, తన సోదరుడితో కలిసి అక్కడే కూర్చున్నారు. సమాధి అలంకరణ పూర్తయ్యే వరకూ అక్కడే ఉన్నారు. తాతయ్యను అందరూ వదిలేశారని, ఇకపై తాతయ్య జయంతి, వర్థంతి వేడుకలను తానే స్వయంగా చూసుకుంటానని ప్రకటించి అక్కడి నుండి వెళ్లిపోయారు ఎన్టీఆర్. అయితే ఇలా ప్రకటించడంతో పలు విశ్లేషణలకు దారి తీస్తోంది. ఇప్పటికే మునుపెన్నడూ చవిచూడని విధంగా టీడీపీ ఓటమి పాలవ్వడంతో ఎన్టీఆర్ కి పార్టీ పగ్గాలు అప్పగించాలని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది, ఈ నేపధ్యంలో ఎన్టీఆర్ చేసిన ఈ ప్రకటనతో ఆయన అప్పుడే రాజకీయాలు మొదలు పెట్టాడా ? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు.

More Related Stories