English   

జయేష్ భాయ్-జోర్దార్ గా వస్తున్న రణ్వీర్ సింగ్

Ranveer Singh
2019-05-29 13:48:36

యష్‌రాజ్ ఫిలిమ్స్ ఆధ్వర్యంలో తెరకెక్కనున్న చిత్రంలో గుజరాతీ యువకుడిగా కనిపించబోతున్న రణ్వీర్ సింగ్. తన తెరంగేట్రం నుంచి విశిష్ట పాత్రలని ఎన్నుకుంటూ వస్తున్న కధానాయకుడు రణ్వీర్ సింగ్, ప్రయోగాత్మక చిత్రాలకు మారుపేరైన యష్‌రాజ్ ఫిలిమ్స్ తో మళ్ళీ జతకట్టనున్నాడు. గుజరాత్ నేపథ్యంలో సాగే ఓ వినూత్నమైన కధకు దివ్యాన్గ్ థక్కర్ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ, యష్‌రాజ్ సంస్థ తరపున మనీష్ శర్మ,  జయేష్ భాయ్ జోర్దార్  అనే చిత్రానికి నిర్మాణ బాధ్యతలు వహించనున్నారు. ఈ చిత్రాన్ని అక్టోబర్ నెలలో సెట్స్ పైకి  తీసుకెళ్లాలని నిర్ణయించారు.

సంజయ్ లీలా భన్సాలీ, రోహిత్ శెట్టి, జోయా అఖ్తర్, కబీర్ ఖాన్, కరణ్ జోహార్ లాంటి ప్రతిభావంతులైన దర్శకులచిత్రాల్లో నటించి పేరు గడించిన రణ్వీర్ సింగ్, కాలక్రమేణా తన నటనైపుణ్యాన్ని నిరూపించుకుంటూ వస్తున్నాడు. పద్మవాత్ లో అల్లాఉద్దీన్ ఖిల్జీ గా, గల్లీ బాయ్ లో ఒక అసాధారణ ర్యాప్ కళాకారుడిగా విభిన్న పాత్రల్లో ఇమిడిపోయి ప్రపంచవ్యాప్తంగా మన్ననలను పొందిన కధానాయకుడు ఇప్పుడొక యువ దర్శకుడికి అవకాశం ఇవ్వడం అభినందనీయం . 

"ఈ సినీ ప్రయాణంలో పలు గొప్ప దర్శకులతో పనిచేసే అవకాశం లభించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. అంతటి ఖ్యాతి పొందిన దర్శకులు నా నటనపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నందుకు ఆనందంగా ఉంది. ఇప్పటి వరకు ఒక కధానాయకుడిగా నేను సాధించిన విజయాలన్నీవారికే అంకితమిస్తాను.నా ద్వారా సినీ పరిశ్రమకు ఒక కొత్త దర్శకుణ్ణి పరిచయం చేయగలుగుతున్నందుకు సంతోషిస్తున్నాను. దివ్యాన్గ్ లాంటి ఔత్సాహిక దర్శకుడు ప్రేక్షకుల ప్రశంసలు సంపాదిస్తాడనడంలో ఏ అతిశయోక్తి లేదు. 83 తర్వాత జయేష్ భాయ్ జోర్దార్ విడుదల అవుతుంది," అని రణ్వీర్ స్పందించారు.

జయేష్ భాయ్ యొక్క కధా విషయం గురించి మాట్లాడుతూ రణ్వీర్ , "యష్‌రాజ్ సంస్ధ నాకొక అద్భుతమైన కథను ఎంపిక చేసింది. ఈ కథ విన్న మరు క్షణమే నేను నా అంగీకారాన్ని తెలిపాను. ఒక మంచి ఉద్దేశం తో జయేష్ భాయ్ ని తెరకెక్కిస్తున్నాం. ఈ చిత్రం అందరికీ నచ్చుతుందనే దృఢ నమ్మకం తో ఉన్నాం. ప్రతి ప్రేక్షకుడికి నచ్చే అంశాలు, సన్నివేశాలు జయేష్ భాయ్ లో ఉంటాయి. ఒక హృద్యమైన కథను చక్కటి హాస్యంతో జోడించి దివ్యాన్గ్ తన దర్శకత్వ ప్రతిభను కనబరచబోతున్నారు," అని తెలిపారు.

"ఒక మంచి కథ, సామజిక, నైతిక విలువలను గుర్తు చేస్తూ తన సందేశాన్ని చక్కటి వినోదంతో మేళవిస్తుంది. దివ్యాన్గ్ ఇలాంటి కథని మాకు వినిపించినప్పుడు మా ఆనందానికి అవధులే  లేవు. కొత్త తరహా కధలను జనాలు ఎప్పుడూ ఆదరిస్తారనే భావన తోనే నేను, రణ్వీర్, బ్యాండ్ బాజా బారాత్ లాంటి చక్కటి చిత్రాన్ని తొమ్మిదేళ్ల క్రిందట తీయగలిగాం. యష్‌రాజ్ సంస్ధ మా ప్రతిభపై ఉంచిన నమ్మకం వల్లనే ఈ రోజు సినీ పరిశ్రమలో రాణించగలుగుతున్నాం. మా సరికొత్త ప్రయత్నం ద్వారా ప్రేక్షకుల గుండెల్లో నిలబడగలిగే సత్తా ఉన్న యువ దర్శకుణ్ణి పరిచయం చేయబోతున్నాం. కమర్షియల్ పంథా లో నడిచే ఓ ప్రయోజనాత్మక చిత్రాన్ని తీయబోతున్నాం," అని మనీష్ శర్మ చెప్పారు.

More Related Stories