English   

మహేష్ బాబు, అనిల్ రావిపూడి సినిమాకు డిజాస్టర్ కెమెరామెన్..

Ratnavelu
2019-06-05 14:51:12

మహర్షి సినిమా విజయం తర్వాత ఎంచక్కా ఫ్యామిలీని తీసుకొని ఫారిన్ టూర్ వెళ్లి పోయాడు మహేష్ బాబు. మరో వైపు ఆయన తర్వాత సినిమా సరిలేరు నీకెవ్వరు కోసం ఇక్కడ అనిల్ రావిపూడి తంటాలు పడుతున్నాడు. మహేష్ జూన్ 10న మళ్లీ ఇండియాకు తిరిగి వచ్చిన తర్వాత వెంటనే రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టాలని దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. కేవలం ఆరు నెలలు మాత్రమే ఉండటంతో పక్కా ప్లానింగ్ తో సినిమా పూర్తి చేసి సంక్రాంతికి విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నాడు దర్శకుడు అనిల్ రావిపూడి. ఇదిలా ఉంటే ఈ సినిమా టెక్నికల్ టీమ్ కోసం అన్వేషణ మొదలు పెట్టాడు ఈ కుర్ర దర్శకుడు. ఇప్పటి వరకు చేసిన సినిమాలకు చిన్నచిన్న టెక్నీషియన్స్ పని చేస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు మహేష్ బాబు లాంటి హీరో అంటే కచ్చితంగా టెక్నీషియన్స్ రేంజ్ కూడా పెరుగుతుంది. సరిలేరు నీకెవ్వరు సినిమా కోసం రత్నవేలును సినిమాటోగ్రాఫర్ గా తీసుకుంటున్నాడు అనిల్ రావిపూడి. అయితే ఇక్కడే అసలు చిక్కు వచ్చి పడింది. 

మహేష్ బాబుతో రత్నవేలుది డిజాస్టర్ కాంబినేషన్. గతంలో ఇద్దరు కలిసి పని చేసిన రెండు సినిమాలు దారుణంగా బోల్తా కొట్టాయి. సుకుమార్ తెరకెక్కించిన నేనొక్కడినే సినిమాకు రత్నవేలు సినిమాటోగ్రాఫర్. ఆ తర్వాత శ్రీకాంత్ అడ్డాలతో చేసిన బ్రహ్మోత్సవం సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర నిరాశ పరిచింది. ఇండస్ట్రీలో సెంటిమెంట్లను ఎక్కువగా నమ్ముతుంటారు. అలాంటిది డిజాస్టర్ ఇచ్చిన కెమెరామెన్ తో మహేష్ బాబు మళ్లీ పనిచేయబోతున్నాడు అంటే అభిమానుల్లో ఏదో తెలియని భయం మొదలైంది. అయితే అనిల్ రావిపూడి వరస విజయాలతో దూసుకుపోతున్నాడు కాబట్టి కచ్చితంగా సరిలేరు నీకెవ్వరు కూడా సంచలన విజయం సాధిస్తుందని నమ్ముతున్నారు వాళ్లు. ఇక రత్నవేలు కూడా మూడోసారి మహేష్ బాబుతో కచ్చితంగా బ్లాక్ బస్టర్ కొడతానంటూ ధీమాగా చెబుతున్నాడు. ప్రస్తుతం చిరంజీవి సైరా సినిమాకు పని చేస్తున్నాడు. అది పూర్తయిన తర్వాత సరిలేరు నీకెవ్వరు టీంతో జాయిన్ కానున్నాడు ఈ టాప్ సినిమాటోగ్రాఫర్.

More Related Stories