English   

బాల‌య్య అంత ఈజీగా ఒప్పుకునేలా క‌నిపించ‌డం లేదుగా..

nbk
2019-06-16 08:08:46

దాదాపు ఆర్నెళ్ళ త‌ర్వాత మ‌ళ్లీ కెమెరా ముందుకొచ్చాడు బాల‌య్య‌. ఇప్పుడు మ‌ళ్లీ ఆయ‌న పూర్తిస్థాయి హీరో అయిపోయాడు. న‌టుడిగా వ‌ర‌స సినిమాలు చేస్తూ ర‌చ్చ చేస్తున్నాడు నంద‌మూరి న‌ట‌సింహం. ఇప్పుడు కూడా కేయ‌స్ ర‌వికుమార్ ద‌ర్శ‌క‌త్వంలో జై సింహా త‌ర్వాత మ‌రో సినిమా చేయ‌డానికి ఒప్పుకున్నాడు ఈయ‌న‌. ఈ సినిమా ముహూర్తం కూడా ఈ మ‌ధ్యే పెట్టారు. దీనికి కూడా సి క‌ళ్యాణ్ నిర్మాత‌. గ‌తంలో బాల‌య్య‌తో అధినాయ‌కుడు సినిమా తెర‌కెక్కించిన ప‌రుచూరి ముర‌ళి ఈ చిత్రానికి క‌థ అందించాడు. ఇందులో బాల‌య్య ప‌వ‌ర్ ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్ గా న‌టిస్తున్నాడ‌ని తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఈ చిత్రానికి రూల‌ర్ అనే టైటిల్ పెట్టాల‌ని ముందు నుంచి బాల‌య్య అనుకుంటున్నాడు. ఇలాంటి ప‌వ‌ర్ ఫుల్ టైటిల్స్ అంటే బాల‌య్యకు కూడా బాగా ఇష్టం.
డిక్టేట‌ర్, లెజెండ్, సింహా లాంటి టైటిల్స్ ఈయ‌న కోస‌మే పుట్టాయేమో అనేంత‌గా ఉంటాయి. ఇక ఇప్పుడు రూల‌ర్ కూడా త‌న సినిమాకు పెట్టుకోవాల‌ని చూస్తున్నాడు ఈయ‌న‌. అయితే కేయ‌స్ ర‌వికుమార్ మాత్రం ఈ సినిమా క‌థ‌కు అది సూట్ కాద‌ని భావిస్తున్నాడు. ముందు రాసుకున్న క‌థకు అయితే ఓకే కానీ ఇప్పుడు రాసుకున్న క‌థ‌కు మాత్రం రూల‌ర్ కాకుండా క్రాంతి అనే టైటిల్ బాగుంటుంద‌ని భావిస్తున్నాడు. అయితే బాల‌య్య మాత్రం త‌న‌కు రూలర్ మాత్ర‌మే కావాలంటున్నాడ‌ని తెలుస్తుంది. ఈ టైటిల్ విష‌యంలో హీరో, ద‌ర్శ‌కుడి మ‌ధ్య పొత్తు కుద‌ర‌డం లేద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. మ‌రి చివ‌రికి ఎవ‌రి మాట నెగ్గుతుందో చూడాలిక‌.

More Related Stories